కార్తీక పురాణము – ఇరవై తొమ్మిదవ అధ్యాయము | Karthika Puranam Twenty Ninth Chapter in Telugu

0
1272
Karthika Puranam Twenty Ninth Chapter
Karthika Puranam Twenty Ninth Chapter

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

 

కార్తీక పురాణము – ఇరవై తొమ్మిదవ అధ్యాయము | Karthika Puranam Twenty Ninth Chapter

రాజు చూచుచుండగానే సుదర్శన చక్రమంతర్థానమందెను.

సుదర్శన చక్రము అంతర్థానము బొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తిచేత పులకాంకితుడై తన శిరమును ముని పాదములపైన బడవేసి ఇట్లని విన్నవించెను.

బ్రాహ్మణోత్తమా!నేను మహాపాపిని. పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను. కాబట్టి గృహస్థుడనైన నాయింటిలో అన్నమును భుజించి నన్నుద్ధరించుము.

నీవు నాయందు దయయుంచి తిరిగి నాయింటికి వచ్చి నన్ను రక్షించితివి. మూడు లోకములకు భయమును కల్గించు నీకు భయమెక్కడిది? భయమను మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా యింటికి వచ్చితివి.

నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని. నాకు పరలోకము సిద్ధించును.

కాబట్టి త్వద్దర్శన దానముతో నాకభయ దానము, దానితో ప్రాణ దానము, దానితో పరలోక దానము సంభవించినవి.

ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాసమహాముని ఆనందముతో యిట్లనియె.

రాజా! ప్రాణములను రక్షించు వాడు తండ్రియని చెప్పబడును. ఇప్పుడు నీచేత నాప్రాణములు రక్షించబడినవి. కనుక నాకు తండ్రివి నీవే. నేను నీకిప్పుడు నమస్కారము చేసినయెడల నీవు దుఃఖించెదవు.

తండ్రికి కష్టము కలిగెడు వ్యాపారము చేయగూడదు. కాన నీకు నమస్కారమును చేయను. బ్రహ్మణ్యుడవైన నేను నీకు గొప్ప కష్టమును కల్గించితిని. దానికి ఫలమును అనుభవించితిని. చివరకు నీవు దయతో ఆ కష్టము నివారించితివి.

రాజా! నీతో కూడా భుజించెదనని దుర్వాసుడు ధర్మ బుద్ధి గలవాడై ధర్మ వేత్తయైన అంబరీషునితో గూడి భుజించెను. సాక్షాత్తూ శివ రూపుడైన దుర్వాసుడు విష్ణు భక్తునియొక్క మహాత్మ్యమును పరీక్షించ గోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమమునకు వెళ్ళెను.

కాబట్టి కార్తిక మాసమునందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము. సమస్త ఫలప్రదము. సమస్త యజ్ఞ ఫలప్రదమగును.

కార్తిక మాసమందు శుక్లైకాదశి నాడు ఉపవాసమాచరించి జాగరణముండి ద్వాదశినాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ జేయువాడు మహాపాతక విముక్తుడగును. మోక్షమును గోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి ఘడియలలోనే పారణ చేయవలయును.

అందులో కార్తిక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము. కనుక దానిని ఎంతమాత్రమూ విడువరాదు. కార్తిక శుక్ల ద్వాదశియందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము. ఈ పుణ్య కథను వినువారు పాప విముక్తులై అనేక భోగములననుభవించి అంతమందు పరమపదము పొందుదురు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకోనత్రింశాధ్యాయ సమాప్తః!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here