శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్ గత రెండురోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్ చర్చ వేదికలో సీతారాములను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీవీ ఛానెల్ ముందు ఆందోళన విషయం తెలిసిందే. కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.
కత్తి మహేష్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన స్వామి పరిపూర్ణానంద
ఈ వ్యవహారంపై రాష్ట్రీయ హిందూ సేన(RHS) వ్యవస్థాపకులు, పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా స్పందించారు. శ్రీరాముడిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిన్న స్వామిజీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వాలకు 24గంటల సమయం ఇచ్చారు. ఆలోపు ప్రభుత్వాలు స్పందించి కత్తి మహేష్ పై చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని స్వామి పరిపూర్ణానంద హెచ్చరించారు. హిందూవులపై గానీ, హిందూ దేవతలపై కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై వదిలిపెట్టేది లేదన్నారు. కత్తి మహేష్ విషయంలో ఎంతటికైనా తెగిస్తామన్నారు.
ఈ ఆర్టికల్ భారత్ టుడే నుంచి సేకరించబడినది.