లైట్ బల్బ్

0
1144

స్కూల్ నుంచి లీనా ఇంటికి తిరిగి వచ్చేసరికి తన తల్లి లైట్ బల్బ్ ని మారుస్తూ కనిపించింది. మాడిపోయిన బల్బ్ ని డస్ట్బిన్లో పడేసి, కొత్త బల్బ్ ని పెట్టాక లీనా తల్లితో చెప్పింది.

“మంచి పని చేశావు. నిన్న రాత్రంతా గది చీకటిగానే ఉంది.”

పాలు తాగాక లీనా తన తల్లితో విచారంగా చెప్పింది.

“నా ఫ్రండ్ సీత వాళ్ళమ్మమ్మ చనిపోయిందిట.”

“అరెరే! సీత బాధ పడిందా?”

“అవును. ఆవిడ్ని చూసి చాలా కాలమైంది. ఆవిడ రమ్మని పిలుస్తూంటే, వెల్దామనుకుంటూనే సీతావాళ్ళు వాయిదావేస్తూ వచ్చారు.” లీనా చెప్పింది. కొద్దిక్షణాల తర్వాత లీనా తల్లితో చెప్పింది. “ఏదో ఓరోజు మన అమ్మమ్మ కూడా చనిపోతుందా?”

“అవును. పుట్టిన వాళ్ళంతా వృద్ధాప్యంలోకి వచ్చాక పోవడం తప్పదు.” లీనా చుట్టూ చెయ్యివేసి తల్లి చెప్పింది.

“అటకమీద కాశీ చెంబు ఉంటే చూసివ్వమని అమ్మమ్మ చాలాసార్లు నన్నడిగింది. కానీ నేను ఆమెను పట్టించుకోలేదు. నా చదువు, ఆటలు, ఫ్రెండ్స్ తో నాకు సరిపోయింది” లీనా చెప్పింది.

“అందుకే మనం మనుషుల్ని లైట్ బల్బ్ లా చూడకూడదు.”

లీనా తల్లి వంక ప్రశ్నార్థకంగా చూసి అడిగింది.

“లైట్ బల్బ్ ల్లానా ..? అంటే..?”

“మనం గదిలోకి వెళ్ళినప్పుడు చీకటి పోవడానికి లైట్ స్విచ్ వేస్తాం. పనవగానే బయటికివస్తూ ఆపేస్తాం. పగలు ఆ బల్బు మనకి గుర్తుండదు. ఇలాగే మనుషులతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే వారి దగ్గరకి వెళ్తాము. అవసరం తీరాక పగలు లైట్ బల్బ్ ని గుర్తుంచుకోనట్లుగా, అవసరం లేనప్పుడు వారిని గుర్తుంచుకోం. మాడిపోయిన బల్బుని మనం మార్చినట్లుగా వారివల్ల మన అవసరం తీరకపోతే కొత్తవారిని వెతుక్కుంటాం. ఈ ప్రవర్తన సరైందికాదు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో ఇలా ప్రవర్తించకూడదు.”

లీనా తల్లి చెప్పింది విని కొన్నిక్షణాలు ఆలోచించి తల ఊపి చెప్పింది.

“నువ్వు చెప్పింది నా విషయంలో కరెక్టే. అమ్మమ్మ వారం వారం మన ఇంటికి వచ్చినప్పుడు కథలు, కబుర్లు చెప్పించుకుంటాను. ఆవిడ అడిగింది మాత్రం చేయను.”

“మనం ఇతరుల విషయంలో మాడిపోయిన లైట్ బల్బ్ లో నిరుపయోగంగా కాక, వెలుగునిచ్చే బల్బ్ లా అంటే.. వారికి ఉపయోగించేలా ప్రవర్తించాలి.” లీనా తల్లి చెప్పింది.

ఆరోజే లీనా అటక మీది కాశీ చెంబుని వెదికి తీసి అమ్మమ్మ కోసం సిద్ధం చేసింది.
– కృష్ణమూర్తి

పసుపు – ఔషధ గుణాలు | Turmeric Medicinal Values In Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here