వివాహం ఎవరి బాధ్యత | Marriage Responsibilities in Telugu

0
3687
Marriages2
వివాహం ఎవరి బాధ్యత | Marriage Responsibilities in Telugu
నేటి యువతకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. నా మనసుకి ఎదుటి వ్యక్తి మీద ఉన్నది నిజమైన ప్రేమా లేక ఆకర్షణ అని.
 
ప్రేమించడంలో తప్పులేదు కాని వివాహం చేసుకునే ముందు కుటుంబ స్థితిగతులకు ఆ అబ్బాయి కాని అమ్మాయి కాని సరిపోతుందా అన్నది ఆలోచించాలి.
 
ఈ ప్రేమ వివాహంలో మొదలు వివాహ ప్రస్థానం తల్లితండ్రులను ఎడిపించడంతోనే ప్రారంభమవుతుంది.
 
తల్లి, తండ్రి ఏడుపుతో మొదలైన వివాహం వాళ్ళు ప్రారంభంలో ఎంతవరకు సంతోషంగా ఉండగలుగుతారు. వాళ్ళు నిజంగా ఆనందంగా ఉండగలిగితే ఫరవాలేదు.
 
అందరు (బంధువులు) ఏమనుకున్నప్పటికీ తల్లితండ్రి వారిని చూసి మురిసిపోతారు. కాని నిజంగా వారే కనుక ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే వివాహానికి ఆశీర్వదించడానికి వచ్చిన వారు అందరూ కూడా తల్లితండ్రిని ఏడిపించి వివాహం చేసుకున్నారు.
 
ఇప్పుడు అనుభవిస్తున్నారు అని అంటారు తప్ప వారికి చేయూతనిచ్చి ఆదరించేవారు ఉండరు. అబ్బాయి, అమ్మాయి ఎంత సంతోషంగా ఉన్నా ఆ సంతోషాన్ని పంచుకోవడానికి తనవారు అంటూ లేక మానసిగంగా వారు చాలా బాధపడే అవకాశముంది.
 
ముఖ్యంగా ఆడపిల్ల తన భర్తయొక్క గొప్పతనాన్ని తన పుట్టింటివాళ్ళకు గర్వంగా చెప్పుకోవాలని తహతగాలాడుతుంది. అలాగే ఏదైనా బాధ కలిగినా అంతే కదా.
 
అంతేకాక వివాహంలో అనేక క్రతువులు ఉంటాయి. ప్రతి క్రతువుకి అనేక మంత్రాలు ఉంటాయి.
 
ఆ మంత్రాలకు అర్ధాలు, పరమార్ధాలు కూడా ఉన్నాయి. ఈ ప్రేమ వివాహంలో ముఖ్యంగా పెద్దలకు తెలియకుండా దండలు మార్చుకుని వివాహం చేసుకున్నవారు వివాహంలో ఉండేటటువంటి క్రతువులనన్నింటిని వారు కోల్పోయినట్లే.
 
వారు పైకి ఎంత బుకాయించినప్పటికీ ఏ వివాహం చూస్తున్న, సినిమాలో ఏదైనా వివాహ ఘట్టం వస్తున్నా, అయ్యో మేము ఇవి అనుభవించలేదే అని అనుకోని సందర్భం ఉండనే ఉండదు.
 
ఎందుకంటే వివాహ ఘట్టంలో ఉన్నవన్నీ కూడా మధుర స్మృతులే.
 
ఉదాహరణకి సుమూహూర్త సమయానికి వధూవరులు తలమీద జీలకర్ర, బెల్లం పెట్టుకుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు తేరిపార చూసుకోవడం, యోక్రబంధనం, మంగళసూత్రదారణ, తలంబ్రాలు మొదలైనవన్నీ కూడా దంపతులు వారి అభ్యున్నతికి కోరుకునే వరాలు.
 
మరి పెద్దలు చేయని ప్రేమ వివాహాలలో ఆ జంట మధురానుభూతులన్నింటిని కోల్పోయినట్లే కదా. పైగా మన సనాతన ధర్మంలో పిల్లలకి వివాహం చేసే బాధ్యత తల్లితండ్రులదే.
 
అంతటి శ్రీరాముడే చెప్పుకున్నాడు, మా తండ్రిగారు అయిన దశరధమహారాజుగారు, సీత, నా భార్య అని నిర్ణయించారు కాబట్టి సీత అంటే నాకు అంత ప్రేమ అని. తరువాత సీత తన సత్ప్రవర్తనతో నేను సీతగా, సీత నేనుగా అయ్యేటట్టు చేసుకున్నది అని. 
 
రామాయణంలోని ఇంకొక కధ ఘ్రుతాచి, శ్రుతకీర్తికి నూర్గురు కుమార్తెలు. వారు దేవకన్యలు. వారు గాంధర్వ కన్యలు కాబట్టి చాలా అందంగా ఉండేవారు.
 
వారి అందానికి ముగ్ధుడై వాయుదేవుడు వారిని వివాహమాడమన్నాడు.
 
అప్పుడు ఆ దేవకన్యలు మాకు మా నాన్నగారు ఉన్నారు. వారిని అడగండి అన్నారు. అందుకు వాయుదేవుడు ఆగ్రహించి వారి శరీరాలను అస్తవ్యస్తం చేసేసారు.
 
వారు అందరూ కూడా వారి శరీర అవయవాలు అన్నీ కూడా వంకరటింకరగా అయ్యేసరికి అతి కష్టం మీద వారి తండ్రిగారిదగ్గరకి వెళ్ళారు.
 
వాళ్ళ నాన్నగారు వారిని చూసి హడలిపోయి, ఏమైందమ్మా అనగా వారు జరిగిన సంగతి చెప్పారు. మరి మీరు దేవకన్యలు కదా.
 
శాపవాక్కు వదిలిపెట్టకపోయారా అని అనగా, ఆ దేవకన్యలు మనలో శక్తి ఉందికదా అని ప్రతివారి మీద మన శక్తిని ఉపయోగించకూడదు అన్నారు.
 
మరి వివాహం చేసుకోకపోయారా అంటే ఈ దేశంలో ఏ ఆడపిల్లకి కూడా తన భర్తను తను ఎన్నుకునే అధికారం, అటువంటి దుస్థితి ఏ ఆడపిల్లకి కలగకుండుగాక అని పిల్లలు అనగానే తండ్రి ఎంతో సంతోషించి ఒక యోగ్యుడైన వటువుని తీసుకొనివచ్చి ఆ కన్యలకిచ్చి వివాహం చేయగానే వారి పూర్వ సుందర ఆకృతులు వారికి దక్కాయి. 
 
అటువంటి దేశంలో పుట్టినవారం మనము కాబట్టి మనము కూడా మన వివాహ విషయం మన పెద్దలకి వదిలి వేద్దాము.
 
వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు.
 
ఇది పాశ్చాత్య సంస్కృతి. వాటిని మనము ఆచరించడం అంత అవసరమా? ఇచ్చిన స్వేచ్చను సద్వినియోగపరుచుకుని తల్లితండ్రి సమాజంలో తల ఎత్తుకుని తిరిగేల చెయ్యాల్సిన బాధ్యత యువతమీద ఉంది.
 
తప్పుగా అడుగువేస్తే క్రుంగిపొఏది తల్లితండ్రే అని యువత తప్పటడుగు వేసేటప్పుడు గుర్తుకువస్తే ఆ తప్పటడుగు వేయక సరి అయిన నిర్దేశిత గమ్యం వైపు ఆడుగు వేసే అవకాశముంది. 
 
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here