తిరుపతి నుండి తిరుమలకు ప్రయాణించేటప్పడు ఘాట్రోడ్డు అనేక మలుపులతో ఉంటుంది. కొన్ని మలుపులు “యు” ఆకారంలో కూడా ఉంటాయి. దేవస్థానం బస్సులలో ప్రయాణిస్తూ ఆ మలుపులను అధిగమిస్తున్నప్పుడు బస్సు పడిపోతుందేమో నన్న భయం ప్రతి భక్తుడినీ పట్టి పీడిస్తూ ఉంటుంది. మరోవైపు కొన్ని వేలఅడుగుల లోతు గల లోయలు. దురదృష్టవశాత్తూ మలుపుల దగ్గర బస్సు బోల్తాపడి లోయలోకి దొర్లితే… బస్సు ఆనవాళ్లు కూడా మిగలవు. అందరూ విగత జీవులుకాక తప్పదు. ఇలాంటి అవాంతరాల నుండి రక్షింపబడుటకే భక్తులు అడుగడుగునా ఆ దేవుని స్మరిస్తూ పరిసరాలు దద్దరిల్లేటట్లుగా “గోవిందా”, “గోవిందా” అంటూ ప్రయాణం సాగిస్తారు. ఏ ప్రమాదమూ జరగకుండా క్షేమంగా తిరుమల చేరుకుని శ్రీనివాసుని దర్శించి జన్మను చరితార్థం చేసుకుంటారు. ఈ విధంగా తన భక్తులను అడుగడుగునా కాపాడుతూ దండాలు అందుకుంటూవుంటాడు కనుకనే శ్రీనివాసుడు అడు గడుగు దండాలవాడైనాడు.
ఇలా ఆ దేవదేవుడు వివిధ సార్ధకనామాలతో భూలోక వైకుంఠమైన తిరుమలలో వెలసి భక్తుల నీరా జనాలందుకుంటూ, ప్రజలందరినీ కాపాడుతూ, కలి యుగ ప్రత్యక్షదైవంగా పూజలందుకుంటున్నాడు.
వేంకటాద్రి సమం స్తానం బ్రహ్మాండే నాస్తి కించన,
వేంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి.