కోతి చెప్పిన నీతి

0
2233

రామచంద్రపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నం తీసుకెళ్లి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని ఖ్యాతి తెచ్చుకున్నాడు రంగయ్య, పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయ్యకి ఓరోజు పొలంలో పని ఉండటంతో కొడుకు సుబ్బయ్యని పాలు తీసుకెళ్లమన్నాడు.

సుబ్బయ్య పాలు తీసుకొని వెళ్తూ దాహం వేసి ఓ బావి దగ్గర ఆగాడు. అప్పుడు అతడికి ఓ దురాలోచన వచ్చింది. తన దగ్గరి అయిదు లీటర్ల పాలకు అయిదు లీటర్ల నీరు కలిపాడు. తండ్రి మీద నమ్మకం ఉంది కాబట్టి, తాను నీళ్లు కలిపినా ఈ ఒక్కరోజుకీ ఎవరికీ అనుమానం రాదనుకున్నాడు.

ఆ పాలను పట్టుకెళ్లి అందరికీ పోశాడు. తండ్రికంటే రెట్టింపు డబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాడు.తిరిగి వస్తున్నపుడు సుబ్బయ్య మళ్లీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు. డబ్బు సంచి పక్కనపెట్టి నీరు తాగుతుండగా ఎక్కణ్నుంచో కోతి ఒకటి వచ్చి ఆ సంచి పట్టుకొని పక్కనున్న చెట్టెక్కి కూర్చుంది. సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణేలను బావిలో ఒకటి, నేల మీదకి ఒకటి చొప్పున విసర సాగింది.

దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా సుబ్బయ్య వల్ల కాలేదు.కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసింది. ఆ సంచిలోకి రూపాయి నాణేల్ని ఏరుకొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య. రంగయ్య సంచి తీసి చూస్తే అందులో అయిదు లీటర్లకు సరిపోయే డబ్బు ఉంది. 

‘కోతి నీకు మంచి పాఠమే చెప్పింది. ఈ సంచిలో అయిదు లీటర్ల పాల డబ్బు విడిచిపెట్టి, నువ్వు కలిపిన నీళ్లకు సరిపడా డబ్బుని బావిలో పడేసింది. పాల డబ్బు మనకి, నీళ్ల డబ్బు బావికి. లెక్క సరిపోయింది. మరెప్పుడూ ఇలాంటి పని చేయకు’ అని హితవు చెప్పాడు.