నామస్మరణ మహాత్యం | Namasmaraṇa mahatyam in Telugu

0
2683
నామస్మరణ మహాత్యం | Namasmaraṇa mahatyam in Telugu
Namasmaraṇa mahatyam in Telugu

శ్రీమన్నారాయణ నామస్మరణ మహాత్యం
**********************************************
ఒకసారి నారద మహర్షి కి ఓ అనుమానము వచ్చింది

నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటాని ? వెంటనే మహర్షి వైకుంఠము వెళ్ళి తన అనుమానమును శ్రీమన్నారాయణుని ముందుంచాడు. భగవంతుడు నారదమహర్షితో ఇలా అన్నాడు. “నారదా! ఇప్పుడే భూలోకంలో నైమిశారణ్యంలో ఒక కీటకం జననమెత్తింది. దానిని వెళ్ళి అడుగు” అని ఆకీటకాన్ని చూపించాడు. భగవంతుని ఆనతి మేరకు నారదుడు ఆకీటకము దగ్గరకు వెళ్ళి నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటని ప్రశ్నించాడు. వెంటనే ఆకీటకము గిలగిలకొట్టుకుని చనిపోతుంది. విచారంగా నారదమహర్షి వైకుంఠము తిరిగి వెళ్ళి జరిగిన విషయము శ్రీమన్నారాయణునికి విన్నవించాడు. “ఒహో! అలాగా!! అయితే మళ్ళీ భూలోకం వెళ్ళి, కశ్యపుని ఆశ్రమములోనున్న కపిలగోవుకి జన్మించిన వత్సము(ఆవుదూడ)ను అడుగు” అని ఆనతిస్తాడు. నారద మహర్షి కశ్యపుని ఆశ్రమములోనున్నఆవుదూడ వద్దకు వెళ్ళి అదే ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నవినగానే ఆ ఆవుదూడకూడ గిలగిల తన్నుకుని చనిపోతుంది.నారదమహర్షి ఆశ్చర్యచకితుడయ్యి, విషయాన్ని శ్రీమన్నారాయణునికి తెలియపరుస్తాడు.శ్రీమన్నారాయణుడు “నారదా! ఇప్పుడే కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ శిశువుని వెళ్ళి నీ ప్రశ్న వెయ్యి” అని చెపుతాడు. అప్పుడు నారదమహర్షి ” ప్రభూ, నావలన ఒకకీటకము ఆవుదూడ చనిపోయినవి. ఇప్పుడు శిశుహత్యాపాతకముకూడా నామెడకు చుట్టుకునేలావుంది.” అని శ్రీమన్నారాయణునితో వాపోతాడు. దానికి శ్రీమన్నారాయణుడు, “నారదా! నీకు ఏహత్యాపాతకము తగలదు. ఆశిశువు వద్దకు వెళ్ళి నీఅనుమానము నివృత్తిచేసుకో” అని అభయమిస్తాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞమేరకు నారదమహర్షి ఆ కాశీరాజుకు జన్మించిన శిశువు దగ్గరకు వెళ్ళి తన సందేహము తీర్చమని అడుగుతాడు. అప్పుడాశిశువు పకపకానవ్వి “ఓ మహర్షి నేను అనేక జన్మలలో చేసిన పాపాల ఫలితముగా నీచమైన కీటకజన్మ ఎత్తవలసివచ్చింది. ఆజన్మలో నీవు వచ్చి “నారాయణ” అనే నామము నాచెవిలో పడవేసావు. ఆ అతిపవిత్రమైన నామము నాచెవిన పడగానే నాజన్మజన్మల పాపము నశించి పవిత్రమైన గోజన్మ వచ్చింది. ఆ జన్మలో కూడా నీవు వచ్చి మరల ఆ అతిపవిత్రమైన నామము నాకు వినిపించావు. తక్ష్ణమే ఆ పుణ్యఫలము అనుభవించనిమిత్తము ఈ కాశీరాజుకు కుమారునిగా జన్మించాను. ఇంతకన్నా నారాయణ నామస్మరణ మహాత్యము ఏమని చెప్పమంటావు! ఓ మహర్షి !” అని ఆ శిశువు మరల తన నరజన్మ అనుభవములోనికి వెళ్ళిపోతుంది.

నారదమహర్షి పరమానందభరితుడై శ్రీమన్నారాయణుని అనేకానేకములుగా స్తుతించి తన ఆశ్రమమునకు తిరిగి వెడతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here