మధ్యాహ్నపు చిన్నకునుకు పని బడలికని తగ్గించి మరలా ఉత్సాహాన్ని తాజాదనాన్ని నింపుతుంది. అయితే ఇంట్లో ఉంటే పర్వాలేదు. మరి ఆఫీసుల్లో పనిచేసేవారికి అటువంటి అవకాశం లేదు. కొంతమంది చిన్న కునుకు అనుకుంటే ఇక పెద్ద మత్తే ఆవహిస్తుందన్న భయంతో మధ్యాహ్నపు నిద్రని బలవంతంగా ఆపుకుంటుంటారు. ఇటువంటి వారు భోజనానంతరం ఈ చిన్న సూచనలు పాటిస్తే నిద్రపోకుండానే మత్తుని వదిలించుకోవచ్చు.
- కునుకు తీసే సమయం లేకపోతే చెవులకు మృదువైన, మనసుకు హాయినిచ్చే సంగీతాన్ని కళ్ళు మూసుకుని పది నిముషాల పాటు వినండి. ఇది నిద్ర మత్తు వల్ల ఆవహించిన నిస్సత్తువని తరిమేసి శక్తి నింపుతుంది.
- కాఫీని ఎక్కువ సేవించకండి. వీలైనంత వరకు పళ్లరసాలు తీసుకోవటం మంచిది. మంచినీరు ఎక్కువ తాగాలి.
- కొవ్వు నిల్వలు ఎక్కువ ఉన్న ఆహారపదార్ధాలు తీసుకోకండి. చేపలు, బీన్స్ వంటివి బ్రెయిన్
ఫుడ్స్. ఇవి మెదడుని చురుగ్గా ఉంచగలుగుతాయి. కొవ్వు నిల్వలున్న ఆహరం తీసుకుంటే అవి సెరొటోనిన్ స్థాయిని పెంచి మత్తుకు కారణమవుతాయి. - మీరు పనిచేసే ప్రదేశాలు బయట గాలివచ్చే అవకాశంలేనివయితే కూర్చున్న చోటే ఉండి నిద్రనాపుకునే ప్రయత్నాలు చేయకుండా లేచి రెండు మూడు నిముషాలు నడవండి. మీ మెదడు మళ్లీ ఉత్తేజితమవుతుంది.