ఒకానొక అడవిలో అనేక చిన్నచిన్న జంతువులు నివసిసూ ఉండేవి. అలాంటి జంతువులలో కుందేలు కూడా ఒకటి. జంతువులన్నీ ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవి. ఎక్కడినుంచో ఒక నక్క వచ్చింది. దాని కన్ను గుంపులో ఉన్న కుందేలుపై పడింది.
కుందేలు అందం, చలాకీతనం నక్క మనసును దోచేశాయి. దాని మాంసం తినాలనే చిరకాలవాంఛ తీర్చుకోవాలని కుందేలును చంపడానికి అనేక ప్రయత్నాలు చేయసాగింది నక్క. దాని దురాలోచనను గ్రహించలేకపోయింది కుందేలు.
ఒకరోజు అడవి సమీపంలో ఉన్న వంగతోటలో మొలిచిన పచ్చికను ఒంటరిగా మేయసాగింది కుందేలు.
“కుందేలు మరదలా! బాగున్నావా? ఈమధ్య కంటికి కనబడటంలేదే” అనే మాటలు కుందేలుకు వినిపించాయి.
తలెత్తిచూసిన కుందేలుకి ఒక్కసారిగా గుండె ఝల్లమన్నది. ఎదురుగా నక్క నిలబడి తనను అదోరకంగా చూడటాన్ని గమనించింది.
“ఆ..ఆ..బాగానే ఉన్నా నక్కబావా!” అంటూ భయంతో వణకసాగింది కుందేలు.
“భయపడకు మరదలా! నిన్నేమీ చేయనులే. నీవు చాలా అందంగా ఉంటావు. తెలివిగల దానవు” అని చెపుదామని ఎన్నోసార్లు ప్రయత్నించా. కానీ వీలుకాలేదు. అనుకోకుండా తటస్థపడ్డావు” అంటూ నాలిక చప్పరించసాగింది నక్క.
తనను చంపి తినడానికే నక్క వచ్చిందని గ్రహించి తీవ్రంగా ఆలోచిస్తున్న కుందేలుకి ఒక ఉపాయం తట్టింది. తన మూతిని వంగమొక్కల మొదళ్లలో ఉంచి వాసన చూడసాగింది. కుందేలు చేస్తున్న పనిని చూసి నక్క ఆలోచనలో పడింది.
“మరదలా! దేనికోసం వెతుకుతున్నావు? విలువైన వస్తువులు ఏమైనా పోయాయా?” అడిగింది నక్క.
“ఆ..ఆ.. అదే. అవునుబావా! ఎంతో విలువైనదాని కోసం వెతుకుతున్నా అదిగనక దొరికితే. అమ్మో…” అంటూ ఆపింది కుందేలు.
“తొందరగా చెప్ప మరదలా” అంటూ దగ్గరగా రాబోయింది నక్క
“అక్కడే బావా! అక్కడే. దగ్గరకు రాకు. దూరంగా ఉండే విషయం చెబుతాను అంది ధైర్యం తెచ్చుకున్న కుందేలు.
“సరే మరదలా” అంటూ దూరంగా నిలబడింది నక్క.
“ఈ మొక్కల మధ్య సంజీవని మొక్క ఉందట. అది దొరికితే అబ్బ ఇంకేముందిలే…” అంటూ మరల ఆపింది కుందేలు.
కుందేలు చేస్తున్న హడావుడికి తన పని మరిచి పోయింది నక్క.
“త్వరగా చెప్పి పుణ్యం కట్టుకో మరదలా” అంటూ బతిమిలాడసాగింది నక్క.
“అవును బావా! దాని వాసన అమోఘంగా ఉంటుంది. అది మన దగ్గరుంటే మనకు చావురాదట. దాని రసం చనిపోయిన వారి నోట్లో పోస్తే బతుకుతారట. ఇక్కడ కచ్చితంగా ఉందని నాకు లేడి అక్క చెప్పింది” అంది కుందేలు.
“మరి నేను కూడా వెతకవచ్చా” అడిగింది నక్క.
“పొదుణ్నుంచీ వెతుకుతూనే ఉన్నా దాని జాడే కనిపించలా. నీకు కనిపిస్తుందటావా? సరే సరే. మన ప్రయత్నం మనం చేద్దాం” అంది కుందేలు.
తనవైపు నక్క వస్తున్నట్లు గమనించి “బావా! దూరం. నీవు అటుపక్క వెతుకు, నేను ఇటుపక్క వెతుకుతా” అన్నది కుందేలు.
సంతోషంతో గంతులు వేస్తూ వెతకసాగింది నక్క.
ఇంతలో తోట యజమాని వస్తున్నట్లు గమనించింది కుందేలు. అదే అదనుగా భావించి బిగ్గరగా అరిచింది…
తన తోటలో ఉన్న పంటను పాడుచేస్తున్నాయని కోపంతో వస్తున్న యజమాని తన చేతిలో ఉన్న దుడ్డుకర్రను కుందేలు పైకి విసిరాడు. పథకం ప్రకారం కుందేలు కర్ర దెబ్బ నుంచి తప్పకుంది. ఆ కర్ర నక్కకు తగలడం వల్ల నక్క కిందపడి గిలగిలా కొట్టుకోసాగింది.
“ఎత్తుకు పై ఎత్తు” పారడం వల్ల కుందేలు ఆనందంతో గంతులు వేసుకుంటూ అడవిలోని తన స్నేహితుల దగ్గరకు పరుగుతీసింది. –
శ్రీనివాసాచార్యులు