చిలుక మనసు – నీతి కథలు

0
2189

వెంకటాపురం గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. గోపుర పై భాగాన చిలుకల గుంపొకటి కాపురముంటున్నది. గ్రామ ప్రజలు భక్తి తిశ్రద్ధలతో పూజలు చేసేవారు. ఆలయం భక్తులతో ఎప్పుడూ కళకళలాడుతుండేది.

భక్తులు అధికం కావడంతో ఆలయం ముందుభాగాన బిచ్చగాళ్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగింది. ఆ బిచ్చగాళ్లలో కుంటి, గుడ్డివాళ్లతో బాటు కొందరు మంచివాళ్లు కూడా బిచ్చమడుక్కునేవారు. గుడ్డి బిచ్చగాళ్లలో రంగయ్య అనేవాడు చాలా ముసలివాడు. వయసులో ఉన్నపుడు భక్తులను “అయ్యా, అమ్మా! ధర్మంచెయ్యండి బాబూ. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు” అని అడుక్కొని కాలం వెళ్లబుచ్చేవాడు. రంగయ్యకు ఇప్పుడు ఎనభై ఏళ్లు రావడంతో భక్తులను ధర్మం అడగటానికి ఆయాసంగా ఉంది. రంగయ్య మాటలు వినబడకపోవడంతో భక్తులు చూసీ చూడనట్లు పోయేవారు. రంగయ్య పక్కనే నర్సయ్య అనే కుంటివాడు నోరు పెద్దగా చేసి భక్తులను ధర్మం అడిగి వేయించుకునేవాడు.

రంగయ్య దీనావస్థను రోజూ తిలకిస్తున్న చిలుక ఒకటి మంచి ఆలోచన చేసింది. “పాపం! గుడ్డివాడు. ముసలివాడు. బిచ్చమెత్తడానికి శక్తి కూడా చాలడంలేదు. అతడికి ఎవరూ లేనట్లున్నారు. పాపం. నిన్నటినుంచి ఉపవాసమే. ఈ ముసలాడికి ఎలాగైనా సహాయం చేయాలి” అని ఆలోచించిందా చిలుక. రోజూ రంగయ్య భక్తులతో అరచే మాటలను, “అయ్యా, అమ్మా! బాబూ! ధర్మం చెయ్యండి నాయనా” అని భక్తులను అడిగింది.

చిలుక మాటలు వింటున్న భక్తులు ఆనందంతో రంగయ్య ముందున్న గిన్నెలో బాగా డబ్బులు వేశారు.

చిలుక చేస్తున్న మేలుకు రంగయ్యకు ఆశ్చర్యం కలిగింది. భగవంతుడు తనకు చిలుకరూపంలో సహాయం చేస్తున్నాడా అనిపించింది.

ఇలా రోజూ చిలుక భక్తులు వచ్చే సమయానికి రంగయ్యకు సహకరించి వెళ్లిపోయేది. రంగయ్య గిన్నెనిండా చిల్లర నాణేలను చూసి నర్సయ్యకు ఒళ్లు మండింది. ఈ చిలుక తనకు శాపంలా దాపురించింది. ఈ చిలుక వల్ల తనకు ఎక్కువ డబ్బులు రావడం లేదు. దీని ముద్దుముద్దు మాటలకు భక్తులు ఆశ్చర్యంగా తిలకించి డబ్బులన్నీ ఎక్కువ రంగయ్య గిన్నెలో వేస్తున్నారు. ఈ చిలుక పీడ ఎలాగైనా వదిలించుకోవాలి” అని ఆలోచించాడు నర్సయ్య.

యధావిధిగా భక్తులు వచ్చే సమయానికి ఆలయగోపురం నుంచి ఎగిరిన చిలుక రంగయ్య చెంతన వాలి భక్తులను దానం అడుగుతున్నది. ఇది గమనించిన నర్సయ్య, అంతకు ముందే తెచ్చి పెట్టుకున్న కర్రతో చిలుక తలపై ఒక్కదెబ్బ వేశాడు. పాపం! చిలుక ఆ దెబ్బకు గిలగిల కాళ్లు తన్నుకుంటూ రెక్కలు ఆడిస్తూ. “బాబూ! ధర్మం చెయ్యండి నాయనా! ముసలాడికి దానంచెయ్యండి” అని అరుస్తున్నది.

నర్సయ్యకు కోపం వచ్చి మరో దెబ్బ చిలుకపై వేయడంతో చిలుక ప్రాణాలు వదిలింది. ఇంత జరుగుతున్నా రంగయ్య నర్సయ్యను ఏమీ చేయలేకపోయాడు. 

“భగవంతుడా! నాకు కళ్లు ఇవ్వలేదు సరికదా. నా దీనావస్థకు జాలిపడ్డ ఆ చిలుక ప్రాణాలు కూడా తీయించావా స్వామీ” అని తన బాధ వెళ్లగక్కి, “ఛీ! దుర్మార్గుడా నీవసలు మనిషివేనా? తోటి మనిషికి సహకరించకున్నా మనిషి బాధను గ్రహించిన ఆ చిలుక ప్రాణాలు తీస్తావా?” అని నర్సయ్యను చీవాట్లు పెట్టాడు రంగయ్య.

“నీవు గుడ్డివాడివి. నీ చిలుకను ఎవరు చంపారో, ఏమో. నన్నెందుకు తిడతావు?” అని గద్దించాడు నర్సయ్య.

“ఒరే నర్సయ్యా! నాకు దేవుడు కళ్లు ఇవ్వలేదు కానీ మనసిచ్చాడు. నీ ద్వేషమే ఆ చిలుక ప్రాణాలు తీయించింది. కాదంటావా. అందుకేరా మన మనుషులకన్నా ఆ పక్షులే నయం” అని ఆవేశంతో తన గిన్నెతో తల బాదుకున్న రంగయ్య కూడా ప్రాణాలు విడిచాడు. నర్సయ్య సంగతి అందరికీ తెలిసి, ఆలయం నుంచి తరిమేశారు.

ఈ రోజు కధ – కృతజ్ఞత | Story of Gratitude in Telugu

భూదాన మహిమ (ఈరోజు కథ) | land donation Story in Telugu