సైన్స్ టీచర్ తన్వీ ఓ పత్రికలో ‘ప్లీ సర్కస్’ గురించి చదివింది. దాన్ని వందేళ్ల క్రితం యూరప్, అమెరికాలలో విస్తారంగా వినోదానికి ప్రదర్శించేవారు.
ఓ రకం పురుగులని ఓ గాజు సీసాలో వేసి దానికి మూతపెడతారు. ఆ పురుగులు అందులోంచి తప్పించుకోడానికి అటు ఇటు, పైకి వేగంగా దుముకుతాయి. పైన మూత వాటి తలలకి తగిలి ఆగిపోతాయి. కొన్నిసార్లు అలా ఎగిరి మూత తగిలాక ఇక అవి అంత పైకి దుముకక, మూతకి కొద్దిగా కిందకు దుముకుతాయి. అవి ఆ మూతకి తగలకుండా దుమకడం అభ్యసిస్తాయి. ఈ శిక్షణ ఇచ్చాక ప్లీ సర్కస్ సిద్దమవుతుంది. సందర్శకులు మూత లేని ఆ సీసాని కదిపితే అందులోని పురుగులు బయటికి గెంతక సీసాలోనే దుముకుతూండటం ఆశ్చర్యంగా చూస్తారు. అంటే అవి మూత కింది ఎత్తుకి కండిషన్ అయిపోతాయి. అంత కంటే ఎక్కువ ఎత్తుకి అవి దుమకాలని అనుకోవు.
ఆ ప్లీ సర్కస్ని తన్వి ఇంటర్ స్కూల్ సైన్స్ ఫెయిర్కి తమ స్కూలు తరఫున తీసుకు వెళ్లదలచుకుంది. దాంతో ఇంటర్నెట్ లో ప్లీ సర్కస్ గురించి సెర్చ్ చేసి, అందులో ఎలాంటి పురుగులో వాడాలో తెలుసుకుంది. అవి తమ ప్రాంతంలో కూడా దొరుకుతాయని తెలిసి సంతోషపడింది. నిజానికి ఆ రకం పురుగులని అనేకసార్లు తన్వి చూసింది కాని ఇది తెలియదు.
ఓ పొడుగాటి గాజు సీసాని తీసుకుని ఆ పురుగులని సేకరించి ప్లీ సర్కస్ని సైన్స్ ఫెయిర్ రోజుకి సిద్ధం చేసింది. సందర్శకులంతా ఆ ప్లీ సర్కస్ ని ఆసక్తిగా ” చూడసాగారు.
“ఇదేమిటి?’ అని అడిగిన ప్రశ్నకి తన్వి దాన్ని తను ఎలా రూపొందించిందో వివరించాక ఇలా చెప్పేది..
‘తల్లిదండ్రులు తమకి తెలీకుండానే పిల్లల్ని ఈ ప్లీ సర్కస్ లోని పురుగుల్లా కండిషన్ చేసేస్తూంటారు. అతను ఎదగకుండా తలని శాశ్వతంగా కిందకి దించుకునేలా చేస్తారు. డాక్టర్ చదువుతానంటే, “అమ్మో! అది చాలా కష్టం. రోజుకి ఇరవై గంటలు చదవాలి. అది మేధావులకి తప్ప మన లాంటి వాళ్లకి కాదు’ లాంటి మాటలతో వారిని ఎదగనివ్వరు. మీరా పని ఇప్పటికే చేసి ఉంటే ఆ మూతని తొలగించండి. లేదా మీ పిల్లల ఎదుగుదలకి మీరు శాశ్వతంగా మేకు బిగించినట్లే. తన్వీకి ప్లీ సర్కస్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
-కృష్ణమూర్తి