
సద్భక్తి అంటే? | సద్భక్తి యొక్క శక్తి | Power of Devotion
సత్ అంటే మంచిది అని అర్థం. సద్భక్తి అంటే మంచి భక్తి. అదేంటి? మంచి భక్తీ చెడుభక్తీ ఉంటాయా? భక్తి అనేక విధాలుగా వ్యక్త పరచబడ్డట్లే అనేక రకాలుగానూ ఉంటుంది. మన ఉద్దేశ్యం, నిబద్ధత ని బట్టి ఆ భక్తి ఫలిస్తుంది. స్వార్థం కోసం దేవునికి పెట్టే నమస్కారానికీ, భగవంతుని తత్వాన్ని గ్రహించి, మనస్ఫూర్తిగా అహాన్ని ఆయన పాదాలవద్ద విడిచి ఆత్మ సమర్పణ చేసుకోవడానికీ ఎంత తేడా ఉంది? అదే సద్భక్తికీ స్వార్థ పూరితమైన తాత్కాలిక భక్తికీ తేడా. భగవంతుని నిష్కల్మషంగా, నిస్సందేహంగా నమ్మిన ఒక సాధారణ పశువుల కాపరి యొక్క అసాధారణమైన కథ తెలుసుకుందాం.
1. పశువుల కాపరి కథ
ఒకానొక మారుమూల కొండ ప్రాంతం లో ఒక యోగి తపస్సునూ, యోగ సాధననూ చేస్తుండేవాడు. ఆయనను ఎంతోకాలం గమనించిన ఒక పశువుల కాపరి ఆయన వద్దకు కుతూహలంగా వెళ్ళి స్వామీ మీరు ఏమి చేస్తున్నారు? అని అడిగాడు. అప్పుడతను తాను భగవంతుని ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడా పశువుల కాపరి భగవంతుడు అంటే ఎవరు? ఆయన ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. విద్యా గర్వం తో ఆ యోగి పశువుల కాపరిని చులకన చేసి ‘చెప్పినా అర్థం చేసుకునే తెలివి నీకు లేదు, నా సమయం వృధా చేయొద్దు ‘ అని ఆ పశువుల కాపరిని అక్కణ్ణుంచీ పంపిస్తాడు. ఎన్నో సార్లు ఆ పశువుల కాపరి యోగిని ఇవే ప్రశ్నలు అడగ సాగాడు. ఇతను పదే పదే అడిగే సరికి ఆ యోగికి విసుగు కలిగి సమాధానం చెప్పదలచుకున్నాడు.