కంకణాలను ఎప్పుడు ధరిస్తారు? | Reason Behind Wearing Kankanam in Telugu
నోములు, వ్రతాలు, యజ్ఞయాగాదులు చేసేటప్పుడు. ముఖ్యమైన శుభకార్యాలను నిర్వహించేటప్పుడు కంకణాలను ధరిస్తారు.
కంకణాలను ఎందుకు ధరిస్తారు?
కం బ్రహ్మాణం కణయతీతి కంకణం. కంకణం ధరించడం ఒక ఆలోచనకు లేదా ఒక ధర్మానికి కట్టుబడి ఉండడం. సుదర్శన భగవానుడు కంకణానికి అధిపతి. మనం చేసిన మంచి ఆలోచన, చేపట్టిన కార్యాన్ని కంకణం నిరంతరం గుర్తుచేస్తుంది. మణికట్టుకి కట్టుకున్న కంకణం రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.
1కంకణాలు ఏవిధంగా ఉండాలి?
కంకణాలు కార్యక్రమాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి. ఎక్కువగా కంకణం అంటే లేత మామిడాకు లేదా తమలపాకు మరియు పసుపు కొమ్ము తో కూడిన, పసుపు రాసిన దారాన్ని వాడతారు. కొన్ని చోట్ల పువ్వుని లేదా పూరేకులని కూడా కట్టుకుంటారు. వాటిని తోరాలు అంటారు.
కంకణం కట్టుకునే దారం మూడు లేదా ఐదు వరుసలు ఉండాలి. తెల్లని నూలు దారానికి పసుపు రాయాలి. దానికి ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వారు తమలపాకు,లేత మామిడాకు లేదా పువ్వుని పసుపుకొమ్ముతో కలిపి కట్టుకోవాలి.
కంకణాన్ని ఎలా ధరించాలి?
దృఢమైన సంకల్పం తో, భక్తితో పవిత్రంగా కంకణధారణ చేయాలి. కంకణాన్ని ధరించే ముందు శుచిగా అభ్యంగన స్నానమాచరించాలి. శుభ్ర వస్త్రాలను ధరించాలి. కంకణం ధరించవలసిన చేతిలో పువ్వును గానీ పండునుగానీ, కొబ్బరికాయ లేదా కొబ్బరి బోండాన్ని గానీ పట్టుకుని కంకణం కట్టించుకోవాలి.
ఆడవారు ఎడమచేతికి మగవారు కుడిచేతికి కంకణాన్ని ధరిస్తారు.