
సాయి బోధ / Sai Baba Bodha
సద్గురువైన సాయినాథుని కథలు అమూల్యమైనవి. ఆయన తన భక్తులకెప్పుడూ గురుభక్తిని గురించీ సన్మార్గమును గురించీ బోధించేవారు. సాయీ సచ్చరిత్రలోని 18-19 వ అధ్యాయాలలో రాధాబాయి అనే ఒక ముసలమ్మకు బాబా తన కథను వివరించే ఘట్టం సదాస్మరణీయమైనది.
2. శ్యామా ప్రార్థన
అట్లు మూడు రోజులు గడిచెను. అమె పట్టుదలకు నేను (శ్యామా) భయపడి యామె పక్షమున బాబాతో నిట్లంటిని, “దేవా! మీరేమి ప్రారంభించితిరి? నీ వనేకమంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదసలిని నీవెరిగియే యుందువు. అమె మిక్కిలి పట్టుదల గలది. అమె నీపైన అధారపడియున్నది. అమె చచ్చువరకు ఉపవసింప నిశ్చయించుకొని యున్నది. నీవు అమె నుగ్రహించి ఉపదేశమిచ్చునంతవరకు కామె తన నిరాహారదీక్షను మానదు. అమె కేమైన హని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన అదేశ మివ్వకపోవుటచే అమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి యామెను కరుణించుము, అశీర్వదించుము, అమెకు తగిన దారి చూపుము!’ అమె మనోనిశ్చయమును జూచి, బాబా యామెను బిలిపించెను.