
సర్వధర్మాల కృష్ణాతీరం
పవిత్ర కృష్ణాతీరంలో సనాతనధర్మంతోపాటుగా సర్వధర్మాలు వెలుగొందాయి. ఎందరో మతాచార్యులకు, బోధకులకు, పీఠకు లకు ఇది ఆలవాలమైంది.
జైన, బౌద్ధ, ఇస్లాం, క్రైస్తవ ధర్మాలు ఈ తీరరేఖలో స్థిరనివాసం ఏర్పరుచుకొన్నాయి. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత భావనలకు ఇది వేదికగా నిలిచింది. ఆధ్యాత్మికవేత్తలు కృష్ణమ్మ స్వరూపాన్ని దివ్యక్షేత్రాల సమాహారంగా అభివర్ణించారు.
మహారాష్ట, కర్ణాటక, తెలంగాణా ఆంధ్రరాష్ట్రాలలో కృష్ణ దాని ఉపనదులు ప్రవేశించిన మేర అనేకానేక క్షేత్రాలు వెలిశాయి. మహబూబ్నగర్ జిల్లా అలంపురాన్ని ఆలయాలపురంగా అభివర్ణిస్తారు. (ఇది తెలంగాణారాష్ట్రంలో కలదు) ఏడో శతాబ్దానికి చెందిన నవబ్రహ్మల ఆలయాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి.
శ్రీశైలం క్షేత్రానికి పశ్చిమ ప్రాంతంగాకల ఈ క్షేత్రంలోని జోగులాంబ ఆలయం శాక్తేయపీఠంగా పేరొందింది.
అలాగే కృష్ణానదిలో తుంగభద్ర కలిసినచోట సంగమేశ్వర క్షేత్రంగా వెలసింది. శ్రీశైలానికి ఉత్తరద్వారంగా పేరొందిన ఏలేశ్వరం మీదుగా శ్రీసిరులను ఒరుసుకుంటూ ప్రవహించిన కృష్ణమ్మ “పాతాళగంగ”గా ప్రసిద్ధి చెందింది.
కృష్ణానది సముద్రంలో కలిసిన ప్రాంతాల్లోని పెదకళ్ళేపల్లి హంసలదీవి సంగమ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి.
వీటితోపాటు కృష్ణానది పరిసరాలలో మంగళగిరి, కోటపు కొండ, మాచర్లవంటి చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యంగల శైవ, వైష్ణవ క్షేత్రాలున్నాయి.