సంతృప్తి
జీవితం ఆనందమయం అవడమనేది వారి వారి ఆలోచనా విధానాన్ని బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తికీ స్పష్టమైన, నిర్దిష్టమైన గమ్యం ఉండాలి.
అయితే ఆ గమ్యం చేరిదిగా ఉండాలి. అలాగేచేరగలిగిన దానితో తృప్తిపడటం తెలియాలి. తిరిగి మరో గమ్యం ఏర్పరచుకోవాలి. ఆ గమ్యాన్ని చేరుకోవటానికి తగిన వనరులు సమకూర్చుకోవాలి.
“గమ్యం గురించి విశ్లేషిస్తున్నాను. ఇంకా నా ఆలోచనకి రూపం రాలేదు”” అనుకుంటూ కాలయాపన చేయటంవల్ల ఫలితం ఉండదు. ఈ విధంగా అనుకునేవారు ప్రతివిషయాన్ని వాయిదా వేస్తూంటారు. అలాంటివారు ఏ పనీ చేయలేరు.
మంచి చేసే అలవాటున్నవారికీ, మంచిని అభినందించే లక్షణాలున్నవారికీ మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయమవుతుంది.
కార్యసాధకులు, మంచివారు ఇతరులను అభినందించటం, ప్రోత్సహించటం లాంటివి చేస్తూనే ఉంటారు. డిగ్రీలు సంపాదించినంత మాత్రాన, నాలుగువిషయాలు ఎక్కువగా తెలిసినంత మాత్రాన ఆ వ్యక్తి ఆలోచనా విధానంలో మార్పు వస్తుందనుకుంటే పొరపాటే అవుతుంది.
విద్యతోపాటు నిజాయితీ, నైతిక విలువలు కలిగి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఆలోచన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది.
ఇకపోతే ప్రతి మనిషి జీవితంలో ముందుకు సాగాలంటే సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. ఇందుకోసం ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రవర్తన కలిగి ఉండాలి.
అయితే ఆ ప్రవర్తన ఆత్మగౌరవాన్ని కించపరచుకునే విధంగా ఉండకూడదు. అలా ఆత్మగౌరవాన్ని కాపాడుకునేవారు తాము మంచి అనుకునే ధోరణితో తోటివారిని మంచిగా చూడటం, వారితో మంచిగా మాట్లాడటం, మంచిగా ప్రవర్తించటం, జీవితం పట్ల సానుకూలంగా, ఆశాజనకంగా ఉండటం వంటి లక్షణాలను కలిగి ఉంటారు.
జీవితం పట్ల సానుకూలత ఉండేవారు “నేను అందరితోనూ మంచినడుచుకొంటాను” అని చెబుతారు. అదే అలా లేని వ్యక్తులు “నేను మంచిగా నడుచుకోవడానికి ప్రయత్ని స్తాను” అంటాడు. ‘మంచిగా ఉంటాను’ అనటానికీ, “మంచిగా ఉండేందుకు ప్రయత్ని స్తాను’ అనేదానికీ చాలా తేడా వుంది.
జీవితం పట్ల సానుకూలత ఉండే వ్యక్తి తాను చేసే ప్రతి పనిలో సంతృప్తినీ, ఆనందాన్ని పొందుతాడు. అలా తాను చేసేవాటితో ఆనందం, సంతోషం చూసుకోవటం అనేది సంతృప్తికరమైన జీవితానికి ఎంతో అవసరం.
ప్రతి మనిషి ఉషోదయం చూసి మురిసిపోవాలి. అలాగే తన దినచర్యను హుషారుగా ఏ చికాకులు, బాధలు లేకుండా ప్రారంభించాలి.
అలా జరగాలి అంటే సానుకూలత, ఆశాజనకం వంటివి ఉండాలి. మనిషి ఆలోచనాసరళిలో మార్పు రావాలి. అప్పుడు బ్రతుకు భారం అనిపించదు.
పైగా జీవితం మరింత ఉన్నతంగా కనిపిస్తుంది. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే అందరి జీవితం ఏ చీకూ చింతా లేకుండా హాయిగా గడిచిపోతుంది.
అలాకాకపోతే ఎదుటివారిలో లోపాలను వెతకటం, లేకపోతే వారికున్నది తమకు లేదనుకోవడం, లేకపోవడం వల్ల అసంతృప్తికి గురవుతుంటాము.
ఒకవేళ అసంతృప్తికి లోను అయితే చాలు మనిషికి తెలియకుండానే కోపం, ఆవేశం, అసూయ కట్టలు తెంచుకొని మనిషిని అధఃపాతాళ లోకానికి తోసివేస్తుంది.
కోపం వివేకాన్ని నాశనం చేస్తుంది. ఆవేశం అనర్థాలకు హేతువు అవుతుంది. అసూయ శీలహీనుడిని చేస్తుంది.
కనుక ఎపుడూ కూడా ఉన్నదానితో సంతృప్తి చెందుతూ భగవంతుని చింతన చేస్తూ ప్రశాంతతను మనసున నిలుపుకొన్నప్పుడూ దారిద్ర్యంలో కొట్టుకుపోయినా సరే మనిషి ఉన్నతుడుగా జీవిస్తాడు.
పరమాత్మకు ఇష్టుడుగా నిలబెడ్తాడు. పరమాత్మను తనలోనూ ఇతరులలోనూ చూడగలిగే నేర్పును గ్రహిస్తాడు. అపుడు జీవితంలో అనుకొన్నవి సాధించడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.