సాత్త్విక సుఖం

0
333

గీతాచార్యుడు భగవద్గీతలో ఒక ముఖ్యమైన విషయాన్ని ఉపదేశిస్తూ శాంతి లేనిదే సుఖం కలగనేకలగదని చెప్పాడు. ఇది చాలా సావధానంగా గుర్తించాల్సిన విషయం. సుఖాన్ని కోరేవాడు ముందు శాంతిని పొందడానికై యత్నించాలి. ఎందుకు? శాంతిగా ఉన్నప్పుడు మనిషి తాను అనుకున్నవి సాధిస్తాడు. అంటే శాంతితోనే విజయాలు సాధ్యమౌతాయి. ఇక విజయాలు పొందినవాడు నిశ్చయంగా సుఖాలను పొందుతాడు.

సీతాన్వేషణ కార్యంలో ఆంజనేయుడికి ఇతర వానరులు పరమప్రోత్సాహాన్ని కలిగించారు. అప్పుడు హనుమంతుని హృదయం ఆనందంతో శాంతిగా అయింది. అందుకే ఆ శాంతిమయహృదయంతో అతడు తాను నిశ్చయంగా సీతమ్మను చూసి సమాచారాన్ని తీసికొని వస్తానని, అప్పటి దాకా సముద్రతీరంలోనే ఉండమని చెప్పి లంకవైపుకు ఎగిరాడు. అన్ని అవరోధాలను అవలీలగా దాటి విజయాన్ని సాధించి తిరిగి శ్రీరాముని చెంతకు చేరుకున్నాడు. ఇదే శాంతిద్వారా విజయం, విజయం ద్వారా సుఖము కలిగే పద్ధతి.

అయితే భగవద్గీత ఒక్కఅడుగు ముందుకు వేసి సుఖంలో కూడ మూడురకాలు ఉంటాయని చెప్పింది. గీతోపదేశం ప్రకారం ఎవరైతే సాత్త్వికసుఖానికై ప్రయత్నిస్తారో వారు సమస్త దుఃఖాలను అధిగమిస్తారు.

సాత్త్విక సుఖంలో మొట్టమొదట తపస్సు ఉంటుంది. తపస్సంటే కష్టంతో పాటు, విసుగు అనిపిస్తుంది. అయితే లక్ష్యసాధనలో ఉండేవారు ఎటువంటి శారీరకతపస్సుకైనా వెనుదీయరు. ఐదేళ్ళ నుండి పదేళ్ళపాటు రోజుకు ఐదారు గంటలు తీవ్రంగా పరిశ్రమిస్తేనే ఎవ్వరికైనా ఒలింపిక్ లో బంగారుపతకం లభిస్తుంది. బంగారుపతకం పొందే క్షణం అతి అల్పమైనదే ఐనా ఆ ఫోటో జీవితాంతం సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. కాకరకాయకూర, వేపాకులు చేదుగా ఉంటాయి. కాని అవి ఆరోగ్యానికి ఎంతో దోహద పడతాయి. మిఠాయి నోటికి రుచిగా ఉంటుంది. కాని శరీరానికి ఎంతో హాని చేస్తుంది.

కాబట్టి యువత ఎప్పుడైనా సరే సాత్త్వికసుఖ భోజనమే చేయాలి. సాత్త్వికసుఖాన్నే కోరుకోవాలి. సాత్త్విక సుఖాన్ని కోరుకుంటే నిశ్చయంగా వచ్చే ఫలితం అమృత మయంగానే ఉంటుంది. సాత్త్వికసుఖాన్ని కోరుకోవాలంటే అటువంటి అలవాట్లు చేసికోవాలి. అటువంటి కార్యాలనే చేయాలి. అటువంటి స్వభావాన్నే అలవరచుకోవాలి.

అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. మనస్సూ బాగుంటుంది. బుద్ధి బాగా పనిచేస్తుంది. విజయాలూ లభిస్తాయి.

తాబేలుశైలి