
Shankara Jayanthi
ముప్ఫై రెండేళ్ల యువకులు ఈనాడు జీవన పోరాటం లో నానా కష్టాలు పడుతున్నారు. ఆర్థిక బాధలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ చికాకులు అంటూ కాలం తో పరిగెడుతున్నారు. కానీ కొన్ని శతాబ్దాల క్రిందట ఒక ముప్ఫై రెండేళ్ల జీవిత కాలం లో ఒక యువకుడు ప్రపంచానికి అద్వైత జ్ఞానాన్ని అందించాడు. తన మతాన్ని ఉద్ధరించాడు. కొన్ని వేల మైళ్ళు పాదచారిగా సంచరించి అనేక పీఠాలు మఠాలు స్థాపించాడు. ఎంతో మంది శిష్యులకు జ్ఞానాన్ని అందించాడు. ఇప్పటికీ ఆయన విజయయాత్రల ప్రభ శృంగేరీ పీఠంగా వెలుగొందుతూంది.
హిందూ మతాన్ని నిర్వీర్యం చేయడానికి, ప్రజల దృష్టిలో హిందూమతాన్ని హింసా మార్గంగా, కఠినమైనదిగా ప్రచారం చేసి, బౌద్ధ మతం తన ఉనికిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న కాలం అది. అనేక హిందూ మతగ్రంథాలు, దేవాలయాలు నాశనం చేయబడ్డాయి. హిందువులలోనే మిడిమిడి జ్ఞానం తో ఆచారాలను తప్పుడు గా ప్రచారం చేసి, హిందూ మతం పేర అనవసరమైన మూర్ఖపు ఆచారాలను ప్రబలించారు కొందరు. హిందూ మతగ్రంధాలలో అసత్యాలను చొప్పించి తప్పుడు ప్రచారం జరిగింది.
ఇప్పుడెలాగైతే హిందూ మతాన్ని అన్ని రకాలుగా నాశనం చేసి తమ మతాలను నిలబెట్టుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయో కొన్ని శతాబ్దాల క్రిందట ఇదే పరిస్థితి కలిగింది. అప్పుడు మహాశివుని మరోరూపంగా భారతదేశం లో 788 వ సంవత్సరం లో కేరళ ప్రాంతం లోని కాలడి లో జగద్గురు శంకరాచార్యులవారు ఉదయించారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. భారతదేశమంతటా పాదయాత్రచేసి హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని చాటారు. అనేక పీఠాలను, మఠాలను స్థాపించారు. హిందూ మతాన్ని పునరుద్ధరించి తన ముప్ఫైరెండవయేట శివైక్యం పొందారు.