శ్రీరాముడు ప్రతిష్టించిన శివుడు

0
8341

శ్రీరాముడు ప్రతిష్టించిన శివుడు

పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లు లో ఉంది. పాలకొల్లులోని క్షీరారామ లింగేశ్వర స్వామిని త్రేతాయుగం లో శ్రీరామ చంద్రుడు ప్రతిష్టించాడని  ప్రతీతి. ఇక్కడి శివలింగం తెల్లగా ఘనీభవించిన క్షీర రూపంలా ఉంటుంది. లింగానికి పైభాగం మొనదేలి ఉండడం వల్ల స్వామిని కొప్పు రామ లింగేశ్వర స్వామీ అనికూడా పిలుస్తారు.

కౌశిక ముని కుమారుడుడైన ఉపమన్యుడు స్వామిని అపారమైన భక్తిశ్రద్ధలతో కొలిచేవాడు. శివుని అభిషేకానికి సరిపడా పాలు దొరకలేదని చింతించి, స్వామిని తన అభిషేకానికి  సరిపోయేన్ని పాలను ఇవ్వమని కోరగా ఆ మహాదేవుడు అక్కడున్న చెరువుని క్షీర సాగరం లోని పాలతో నింపాడు. అప్పటినుండీ ఆ ప్రాంతం క్ష్రీరారామం అయింది. అదే పాల కొలను అయి తరువాత పాల కొల్లు గా మారింది.

ఆలయం 120 అడుగుల ఎత్తుతో 9 అంతస్తుల తో దేదీప్యమానంగా ఆంధ్ర ప్రదేశ్ లోనే అత్యంత ఎత్తైన ఆలయంగా విరాజిల్లుతూ ఉంటుంది. 9 వ శతాబ్దానికి చెందిన చాళుక్య భీమరాజు ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. 10 వ శతాబ్దం లో వేలుపతి ప్రాకారాన్ని నిర్మించాడు. 14 వ శతాబ్దం లో అల్లాడరెడ్డి ఆలయ గోపురాన్ని నిర్మించాడు. ఆదిశంకరాచార్యుడు ఈ ఆలయం లో శ్రీచక్ర ప్రతిష్ట చేశాడు. ఆలయ మండపం లో నల్లరాయితో నిర్మించిన 72 స్థంబాలు ఉన్నాయి. ఆలయ ప్రాకారం లోపల మంటపాలలో గోకర్ణేశ్వరుడు, గణపతి,సుబ్రహ్మణ్యేశ్వరుడు,జనార్దన స్వామీ మొదలుగా లక్ష్మీ, పార్వతి, వీరభద్రుడు ఇలా అనేకమంది దేవతలు కొలువుదీరి ఉన్నారు. పాలకొల్లు క్షేత్రం లో గోస్తనీ నది ప్రవహిస్తుంది. నరసాపురం దగ్గర అది గోదావరి లో కలుస్తుంది.

రాజమండ్రికి 67 కి.మీ. దూరం లో క్షీరారామ లింగేశ్వరాలయం ఉంటుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here