
శనీశ్వరుడికి నల్లని రంగు అంటే అత్యంత ఇష్టం. ఆ రంగు బట్టలని ధరించిన వాళ్ళకి శనిదేవుడు హాని కలిగించడు.
అయ్యప్ప తన భక్తులను కాపాడటానికి నల్లని రంగు దుస్తులు ధరించమని చెప్తాడు. అంతే కాక అయ్యప్ప దీక్ష శీతాకాలంలో చేస్తారు కాబట్టి నల్లని రంగు దుస్తులు శరీరానికి వేడిని ఇస్తాయి(శాస్త్రీయమైన కారణం).
అయ్యప్ప దీక్షలో అందరిని “స్వామి” అని ఎందుకు పిలుస్తారు?
జీవులన్నిటిలోను దేవుడున్నాడనే భావంతోనే జీవులన్నిటిని “స్వామి” అని పిలవాలని అయ్యప్ప దీక్షలో నియమాన్ని విధించారు.
అందుచేతనే అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు అందరినీ “స్వామి” అనే పిలుస్తారు.
అయ్యప్ప స్వాములు నుదుట గంధం, కుంకుమ ఎందుకు ధరిస్తారు?
మానవుల కనుబొమ్మల మధ్య భాగమునందు “సుషుమ్న” అనే నాడి ఉంటుంది. ఈ సుషుమ్న నాడిలో భగవంతుడు జ్ఞాన రూపములో సంచరిస్తూ ఉంటాడని భారతీయుల విస్వాసము. అందుచేతనే ఆ ప్రదేశాన్ని గంధంతోను, కుంకుమతోను అలంకరిస్తారు.
అయ్యప్పస్వామి వారి రెండు మోకాళ్ళ చుట్టూ ఉండే బంధనం ఏమిటి?
వారెందుకలా అమరి ఉన్నారు?
శబరిమల కోవెలలో అయ్యప్పగా చిన్ముద్ర దాల్చి భక్తులను అనుగ్రహించుచున్న సమయంలో, తనకు శబరిగిరిపై ఆలయం కట్టించి, తన ఆభరణములను మోసుకుంటూ పద్దెనిమిది మెట్లెక్కి వస్తున్న తండ్రియగు పందళ రాజును చూచి మర్యాద నిమిత్తం లేచి నిలబడుటకు ప్రయత్నించిన తరుణాన, పందళ రాజు తన భుజాన తొడిగియున్న పట్టు వస్త్రముతో శ్రీ స్వామివారి రెండు మోకాళ్ళను చుట్టు బంధించి, తాను ఇచ్చట ఇలాగే కొలువుతీరాలని స్వామివారిని ప్రార్ధించుకున్నారట. అదియే స్వామివారి “పట్టబంధనం”.