
పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు.
- పుష్కరారంభమైన మొదటి దినమున బంగారు, వెండి, ధాన్య భూదానములనిచ్చు మానవుడు లోకమున సమస్త భోగములననుభవించి దేహాంతరమున సూర్యలోకమును చేరును.
- రెండవ దినమున వస్త్ర, లవణ, ధేను, రత్నదానములనిచ్చిన వాడు వసురుద్రాదిత్య లోకములయందు దివ్యభోగము లననుభవించి, మరుజన్మమున సార్వభౌముడగును.
- మూడవ దినమున శాక, ఫల దానములనిచ్చినవాడు కుబేర అశ్వనీ దేవతాలోక సౌఖ్యములననుభవించి ఇంద్ర విభవుడై జన్మించును.
- నాల్గవ దినమున ఘృత, తైల, మధు, క్షీరదానముల జేయువాడు దీర్ణాయురారోగ్యవంతుడై, దేహాంతరమున వైకుంఠమును చేరును.
- ఐదవ దినమున ధాన్య శకట, మహిషి వృషభదానముల నిచ్చినవాడు ఇహమున దివ్యభోగములననుభవించి తదుపరి కైలాసము బొందును.
- ఆరవ దినమున అగరు, కస్తూరి, చందనాది దానములు చేసినవాడు ఆరోగ్యవంతుడై పుట్టును.
- ఏడవ దినమున గృహ, పీఠ, శయ్యా ,ఆందోళికా దానములు చేసినవాడు ఆరోగ్యవంతుడై మరుజన్మమున సింహాసనా ధీశ్వరుడగును.
- ఎనిమిదవ దినమున గంధం, దారు, పుష్ణమాల దానము జేసినవాడు ఇహలోకమున సమస్తేశ్వర్యములను బొందును.
- తొమ్మిదవ దినమున తీర్థ శ్రాద్ధ పిండదానముల, దాసీ, శయ్య, దానములు చేసినవాడు సకలైశ్వర్యములను బొందును.
- పదియవ దినమున మహాశాక, సాలగ్రామ పుస్తక దానములను చేసినయెడల అక్షయ పుణ్యలోకములను బొందును.
- పదకొండవ దినమున గజ తురగాది దానములను చేసినయెడల ఇహసౌఖ్యాలన్నింటిని అనుభవించి, తరువాత వైకుంఠమును పొందును.
- పండ్రెండవ దినమున తిలాదానము చేసిన సర్వారిష్ట నివారణము.