గోవిందనామాల విశిష్టత ఏమిటి?

0
1867

“శ్రీవేంకటేశ్వర గోవిందనామములు” రూపొందించిన మహాభక్తుని పేరు తెలియదు. ఎక్కడా ముద్రితం కాలేదు. కానీ చాలాకాలంగా సామాన్యులేకాక – మాన్యులుకూడా ఈ మహాశక్తిమంతాలైన నామావళిని నిత్యం పఠించి, ఎన్నో లాభాలు పొందుతున్నారు. భవిష్యత్తులో కూడా పొందుతారు. ఇందులో ప్రతినామంచివర ‘గోవిందా’ అనే దివ్యనామం అనుబంధంగా, విధిగా ఉంటుంది కనుక వీటిల్ని ‘గోవిందనామాలు’ అంటున్నాం. గోవిందునియొక్క 108 నామాలు కనుకనూ ఇవి ‘గోవింద నామాలు’ అయ్యాయి. ఇవి విశేషించి-శ్రీవేంకటేశ్వరునిరూపాన్నీ, గుణాలనూ, ధర్మసంస్థాపననిష్ఠనూ, దశావతారమూలతత్త్వాన్ని, శ్రీపద్మావతీప్రియత్వాన్నీ, ఇలా అనేక కోణాల్లో శ్రీవారిని వర్ణించి, కీర్తించడం ఇందలి విశిష్టత! పాటగా, తాళలయాత్మకంగా భజన రూపంలో అందరూ కీర్తించడానికి, అష్టోత్తరశతనామావళి స్తోత్రంలాగా పారాయణం చేసుకోవడానికీ ఇవి అనుకూలంగా ఉన్నాయి.

ఇందులో మొత్తం 134 పాదాలున్నాయి. వాటిలో “గోవిందా హరి గోవిందా! గోకులనందన గోవిందా!” అనే రెండుపాదాలు-13 మార్లు వస్తాయి. కనుక ఇవి 26 పాదాలు. ఇవిగాక ప్రత్యేకంగా ఉండేవి 108. ఈ గోవిందనామావళి భజనపద్ధతిలో తాళలయాత్మకంగా పాడేటప్పుడు నిజంగానే మాటల కందని ఒక దివ్యానుభూతి భక్తులకు అలవోకగా చేకూర్తుంది. మనోనేత్రంతో శ్రీవారిని దర్శించిన అనుభూతి సిద్ధిస్తుంది. శ్రీవేంకటేశ్వరుని – విష్ణుత్వం ఈ గేయంలో సర్వత్ర గోచరిస్తుంది. భక్తుల పాలిటికి ఈ స్తోత్రం కల్పవక్షం!