దిలిప మహారాజు – కామధేనువు | Story of King Dilipa in Telugu

0
6892
kamdhenu-and-her-calf
Story of King Dilipa in Telugu

Story of King Dilipa in Telugu

పెద్దలను, పూజ్యులను గౌరవించడం హిందూధర్మం లో ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. శ్రీరాముని పూర్వీకుడైన దిలీప మహారాజు కథ ఈ విషయాన్ని మనకు మరొక్కసారి తెలియజేస్తున్నది. ఆ కథ తెలుసుకుందాం.

సంతానం కోసం దిలీప మహారాజు విచారం

సూర్యవంశములో శ్రీరామునికి పూర్వుడైన దిలీపమహారాజు పరాక్రమవంతునిగా జగజ్జేతగా పేరు పొందినవాడు. ఆయన భార్య సుదక్షిణాదేవి. చాలాకాలంగా వారికి సంతానం కలుగలేదు. తన స్థితికి విచారించిన దిలీపుడు వశిష్ట మహామునికి తన బాధను విన్నవించుకొన్నాడు. అప్పుడు వశిష్టుడు ఇలా అన్నాడు. రాజా నీవు ఇంద్రలోకం వెళ్ళినపుడు కల్పవృక్షపు ఛాయాలలో ఉన్న కామధేనువుకు నమస్కరించక వచ్చేశావు. అనివార్యమైన నీ ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో నీవు గుర్తించకపోయినప్పటికి కామధేనువు నిన్ను హెచ్చరించింది. కానీ రథం యొక్క వేగం వల్ల నీకది వినిపించలేదు. దానివల్ల నీకు పూజ్యపూజావ్యతిక్రమ దోషమేర్పడినది. నీ సంతనలేమికి కారణమదే అని వశిష్టుడు అన్నాడు.

వశిష్టుడు చెప్పిన పరిష్కారము

‘తెలియక నీవు చేసిన అపచారం వల్లనే నీకు సంతానం కలుగలేదు. ఇప్పుడు నీవు వెళ్ళి వేడుకోవడానికి కామధేనువు అక్కడలేదు. వరుణ దేవుడు చేసేయాగానికి, పాలు, నెయ్యి, ధనధాన్యాలను సమకూర్చడానికి పాతాళానికి వెళ్లింది. ఆమె వచ్చేవరకూ ఆమె కుమార్తె అయిన ఈ నందినీ ధేనువును 21 రోజులు సేవించి తరించ’మని చెప్పాడు.

దిలీపుని గో భక్తి

వశిష్టుని ఆజ్ఞప్రకారం దిలీప మహారాజు, సుదక్షిణా దేవి నందినీ ధేనువును భక్తి శ్రద్ధలతో పూజించేవారు.  21 రోజులు వారి సేవలకు ఎంతగానో సంతోషించిన నందినీ ధేనువు వారిని పరీక్షించడానికి ఉన్నపళంగా హిమాలయ పర్వతం లోని ఒక గుహలోపలికి వెళ్లింది. పరమశివుని కింకరుడైన కుంబొదరుడు అనే సింహము ఆ గుహలో ఉన్నది. పార్వతీదేవియోక్క దేవదారు వృక్షానికి కాపలాగా శివునిచే నియమింపబడ్డ సింహమది. కుంబొదరుని బారినపడ్డ నందినీ ధేనువును కాపాడటానికి అక్కడికి వచ్చిన దిలీపుడిని చూసి ఆ సింహము ఈ విధముగా పలికెను. “ఓ మహారాజ..! ఇక్కడకువచ్చిన ఏ ప్రాణినైన ఆహారముగా స్వీకరించే అధికారాన్ని పరమశివుడు నాకు ప్రసాదించాడు. కావున ఈ ధేనువును వదలను’’ అన్నది. అది విన్న మహారాజు  “కుంబోదరా నేనుకూడా పరమశివుని భక్తుడనే కానీ వశిష్టుని హోమధేనువుని కాపాడే బాధ్యత నామీద ఉన్నది.  కావున నన్ను ఆహారముగా స్వీకరించి ఆ ధేనువుని విడిచిపెట్టుము అని పలికెను. దిలీపుని మాటలకు కుంబోదరుడు నవ్వి ‘రాజా నీవు తెలివైనవాడవని విన్నాను కానీ ఇంత మూర్ఖంగా ఎలా మాట్లాడుతున్నావు? యవ్వనం లో ఉన్నావు. జగజ్జేతవు, నీ జీవితాన్నీ, భార్యనీ, నిన్నే నమ్మిన ప్రజలనీ తృణప్రాయంగా ఎంచి ఈ ధేనువు గురించి ఆలోచిస్తున్నావు. నీవు బ్రతికి ఉంటే ఆవులకేమి కొదవ’ అంది. కానీ దిలీపుడు తన ధర్మాన్ని వీడలేదు. తనని ఆహారంగా స్వీకరించమని ఆ సింహం ఎదుట తలవంచి నిలుచున్నాడు.

నందిని వరం

దిలీపుని ధర్మపాలనకు మెచ్చిన నందినీ ధేనువు ఇలా అంది ‘రాజా..! విచారపడకు. ఈ కుంభోదరుడే కాదు నన్ను ఈ ముల్లోకములలో ఎవరూ సంహరించలేరు. నీ భక్తికి సౌశీల్యానికి మెచ్చాను. నా క్షీరములను స్వీకరించి పుత్రప్రాప్తిని పొందుము.’ అన్నది. అప్పుడు దిలీపుడు ‘ తల్లీ నీ కరుణ అమోఘమైనది. నీ పాలకోసం లేగదూడ ఎదురుచూస్తున్నది. యాగార్థం మహర్షులు నీ క్షీరముకై ఎదురుచూస్తున్నారు. అందరూ స్వీకరించగా చివరగా 1/6 వ వంతును నేను తీసుకుంటాను. అన్నాడు. నందినీ ధేనువు అతని సత్యశీలతకు అభినందించి అంగీకరించింది.

ఈ కథ వల్ల తెలిసే నీతి

పూజ్యులను ఎన్నటికీ నిర్లక్ష్యం చేయరాదు. అది మన శ్రేయస్సుకు భంగం కలీంచవచ్చు. ధర్మమార్గం, సత్యశీలత అనే గుణాలు కలిగి ఉండడం వల్ల ఎల్లప్పుడూ రక్షించబడతాము.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here