దీపావళి పండగ సందర్భంగా బాణ సంచా కాల్చుకునేందుకు సుప్రీం కోర్టు కొత్త నిబంధన విధించింది. బాణసంచా కాల్చుకోవచ్చు. కానీ, రెండు గంటలు మాత్రమే. అది కూడా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే. ఇతర పండుగ రోజుల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది. కాకపోతే.. కొత్త సంవత్సరం, క్రిస్మస్ సంబరాల్లో మాత్రం రాత్రి 11.45 నుంచి 12.30 గంటల వరకూ కాల్చుకోవచ్చు అంటూ సుప్రీం కోర్టు షరతులు విధించింది. దేశవ్యాప్తంగా బాణసంచా తయారీకి, విక్రయానికి కూడా అనుమతిచ్చింది. అయితే, తక్కువ కాలుష్యం వెదజల్లే పర్యావరణహిత (గ్రీన్) బాణసంచానే విక్రయించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ ఆదేశాలు జారీ చేశారు. వాయు కాలుష్యాన్ని నిరోధించడానికి దేశవ్యాప్తంగా బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
దీపావళికి ముందు బాణసంచా విక్రయాలపై గత ఏడాది సుప్రీం కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. తయారీదారులు విజ్ఞప్తి చేసినా ఉత్తర్వులను సడలించేందుకు ససేమిరా అంది. బాణసంచాను నిషేధిస్తే కాలుష్య స్థాయిలు ఎలా ఉంటాయో పరిశీలించడానికి ఇదొక ప్రయోగమని అప్పట్లో వ్యాఖ్యానించింది. కానీ, ఈసారి మాత్రం తయారీకి, విక్రయానికి, కాల్చుకోవడానికి షరతులతో అనుమతి ఇచ్చింది. ధ్వని, కాంతి, విషపూరిత రసాయనాలు అనుమతించిన స్థాయిలో ఉన్న బాణసంచానే మార్కెట్లో విక్రయించాలని నిర్దేశించింది. ఒకవేళ, ఎవరైనా నిషిద్ధ బాణసంచాను కాలిస్తే, అందుకు ఆ ప్రాంత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను బాధ్యుడిని చేస్తారు. ఢిల్లీ-దేశ రాజధాని ప్రాంతంలో దీపావళి, ఇతర పండుగ రోజుల్లో సమష్టి(కమ్యూనిటీ)గా దీపావళి వేడుకలు జరుపుకోవడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.