పనిమీద పట్నం వెళ్ళిన రాజయ్య అనే రైతు, పని ముగించుకుని వస్తూ, ఒక దుకాణం ముందు ఆగాడు. అది శాలువాలమ్మే దుకాలం. దాని యజమాని అతన్ని లోపలికి ఆహ్వానించి ఒక శాలువా చూపిస్తూ, “మీరు కొనడం, కొనకపోవడం వేరే సంగతి. ఇది చాలా అపురూపమైన శాలువా, ఆయినా ధర చాలా తక్కువ. దీన్ని కప్పుకుని బయలుదేరారంటే, మిమ్మల్ని సాక్షాత్తు ఈ ఊరి జమీందారే అనుకుంటారు. ఒకసారి కప్పుకుని, అలా వీధిలోకి వెళ్ళి రండి ” అంటూ శాలువాను రాజయ్య భుజాల మీద కప్పాడు.
రాజయ్య మొహమాటపడి, ఆ శాలువాతో వీధి అటు నుంచి యిటు తిరిగి, దుకాణంలోకి వస్తూండగా, దాని యజమాని, “ఆహాఁ, ఎంతో అపురూపమైన శాలువా కప్పుకున్న మీరు తప్పక యీ ఊరి జమీందారుగారే అయి వుంటారు ! మహాభాగ్యం, ఏమి సెలవు ?”, అన్నాడు రాజయ్యను గుర్తుపట్టనట్లే.
దుకాణదారు మాటకారితనం చూసి ముచ్చటపడి, రాజయ్య ఆ శాలువా కొన్నాడు.