
సంధ్య తొమ్మిదవ పుట్టినరోజుకి రకరకాల బహుమతులు వచ్చాయి. మినియాన్స్ మూవీ, ఐరన్ మాన్, డివిడిలు, ఓ టెడ్డీబేర్, చాక్లెట్ బాక్స్, సంధ్యకి ఇష్టమైన దడుస్ మిఠాయి దుకాణం వారి పన్నీర్ జిలేబీ మొద లైనవి. అందమైన చేతి రాతతో ‘టెన్ గోల్డెన్ రూల్స్’ అన్న హెడ్డింగ్ కింద రాసిన ఓ ఫొటో ఫ్రేమ్ కూడా వచ్చింది. వాటిని సంధ్య, ఆమె తండ్రి ఆసక్తిగా చదివారు.
టెన్ గోల్డెన్ రూల్స్
- ఇతరుల కోసం ఏదైనా చెయ్యి.
- నీ కోసం ఏదైనా చెయ్యి.
- నీకు చేయటానికి ఇష్టం లేనిది, కాని నువ్వు తప్పనిసరిగా చేయాల్సింది వాయిదా వేయకుండా వెంటనే చెయ్యి.
- ముప్పావుగంట శారీరక పరిశ్రమ చెయ్యి. (నడక బెస్ట్)
- ఓ ముప్పావు గంట ఏకాంతంగా గడుపు.
- దైవ ప్రార్ధన చెయ్యి.
- ఏదైనా పుస్తకంలోని కొన్ని పేజీలను చదువు.
- ఎనిమిది గ్లాసుల మంచినీళ్లు తాగు.
- బంధుమిత్రుల ఫంక్షన్లకి తప్పనిసరిగా వెళ్లు. నువ్వు అక్కడ ఉండటం ఒక్కటే వారికి నువ్విచ్చే విలువైన బహుమతి.
- అక్కర్లేని వారి గురించి ఇతరులతో మాట్లాడకు.
‘నాకు ఇవెందుకు ఇచ్చారు?’ సంధ్య తన తండ్రిని అడిగింది.
‘వాటిని పాటించడం వల్ల నీ భవిష్యత్తు ఎంతో బావుంటుంది?
కాని ఆయన చెప్పిన ఆ వివరణ ఆ పాపకి అర్థం కాలేదు.
మర్నాడు తన మిత్రుడు ఇంటి స్లాబ్ ని వేస్తుండటంతో అతన్ని అభినందించడానికి వెళ్లిన దామిని తండ్రి తన వెంట తన కూతుర్ని కూడా తీసుకువెళ్లాడు.
కూలీలు లైన్ గా నిలబడి ఒకరి చేతులు మీంచి మరొకరి చేతిలోకి కాంక్రీట్ గమేళాలని అందుకుని రూఫ్ మీద పోయడం గమనించిన సంధ్య ఆశ్చర్యపోయింది.
“ఓ! ఇది చాలా కష్టమైన పని”
తర్వాత ఇంట్లోకి వెళ్లి సీలింగ్ మీద చెక్కలు, వాటికి సపోర్ట్గా కింద దుంగలు ఉండటం చూసి సంధ్య తండ్రిని అడిగింది. ‘ఆ చెక్కలు ఎందుకు నాన్న?’ ‘అవి లేకపోతే సిమెంట్ గట్టి పడేదాకా రూఫ్ నిలబడదు’
“సిమెంట్ గట్టి పడ్డాక, ఆ చెక్కలని తీస్తే ఏమవుతుంది?”
‘ఏం కాదు సిమెంట్ గట్టిపడి నిలుస్తుంది. దాని మీద నువ్వు నిలబడినా, గెంతినా ఏం కాదు’
కొద్ది క్షణాలు ఆలోచించి సంధ్యతో తండ్రి మళ్లీ ఇలా చెప్పాడు.
‘నిన్న నువ్వు చదివిన ఆ టెన్ గోల్డెన్ రూల్స్ ఈ చెక్కల సపోర్ట్ లాంటివి. నియమాలు మన ప్రవర్తనకి సరిహద్దులని ఏర్పరచి ఏది సరైన ప్రవ ర్తనో, ఏది కాదో బోధిస్తాయి’
అంటే ఆ రూల్స్ మన ప్రవర్తన, కాంక్రీట్లా సెట్టయ్యేదాకా చెక్కల్లా సపోర్ట్ ని ఇస్తాయన్న మాట’ సంధ్య ప్రశ్నించింది.
‘అవును. అందుకే ప్రతీ సమాజం ప్రతీ మతం ఇలాంటి గోల్డెన్ రూల్స్ని ప్రబోధిస్తుంటాయి. వాటిని పాటించడం వల్ల మనం ఎక్కువ పరిపక్వతతో ప్రవర్తించ గలం’
‘అయితే నాకు వచ్చిన అన్ని బహుమతులకన్నా ఆ టెన్ గోల్డెన్ రూల్స్ గొప్ప బహుమతి. నేను వాటిని తప్పక పాటిస్తాను’ సంధ్య ఉత్సాహంగా చెప్పింది.
– వెంకట కృష్ణమూర్తి