అల్లినగరం గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని కొడుకు సోమయ్య. పేరుకు తగ్గట్టే సోమరిపోతు. ఏపనీ చేసేవాడు కాదు. రామయ్య సోమయ్యకి ఏదైనా పనిచేసి ఎంతో కొంత సంపాదించడం అలవాటు చేసుకొమ్మని ఎన్నో విధాల నచ్చచెప్పాడు. తండ్రి మాటలు సోమయ్య చెవికెక్క లేదు. ఎలాగైనా సోమయ్యకి కష్టించి పని చేయడం అలవాటు చేయాలన్న ఉద్దేశంతో అతను పనిచేసి సంపాదించేదాకా ఇంట్లో అన్నం పెట్టొద్దని భార్యని కట్టడిచేశాడు. సోమయ్యకు ఉపాయాలకి మాత్రం కొదవ లేదు. తండ్రి పెట్టిన ఆంక్షని తప్పించుకోవడానికి వాడో ఉపాయం ఆలోచించాడు. తల్లిని బతిమాలుకుని కొంత డబ్బు తీసుకున్నాడు. సాయంత్రం తండ్రి పొలం నుంచి ఇంటికి రాగానే ఆ డబ్బు ఆయనకిచ్చి తాను కష్టపడి సంపాదించానని చెప్పాడు. రామయ్య ఆ డబ్బులు తీసుకుని తిన్నగా వంటింట్లోకి వెళ్లి, మండుతున్న పొయ్యిలో పడేశాడు. సోమయ్య మాత్రం హాయిగా భోంచేశాడు.
మర్నాడు సోమయ్య డబ్బుకోసం తల్లిని బతిమాలాడు. కన్న ప్రేమతో ఆమె డబ్బు ఇచ్చింది. సాయంత్రం ఆ డబ్బు తండ్రి చేతిలో పెట్టగా మళ్లీ ఆయన దాన్ని మంటల్లో వేశాడు. తను కష్టపడి సంపాదించలేదనే విషయం అర్థమైపోయిందని సోమయ్య తెలుసుకున్నాడు. ఈసారి కష్టపడి సంపాదించి డబ్బు తెస్తే ఏంచేస్తాడో చూద్దామని మూడో రోజు కూలిపనికి వెళ్లాడు. సాయంత్రందాకా కష్టపడ్డాక కూలిడబ్బులు చేతి కొచ్చాయి. వాటిని తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. అయితే రామయ్య ఈసారి కూడా వాటిని మంటల్లోనే వేశాడు. సోమయ్యకి ఒళ్లు మండి పోయింది. గభాల్న మంటల్లో చెయ్యి పెట్టి, డబ్బు బైటికి తీసి, “నాన్నా! ఇదేమైనా బాగుందా? పగలల్లా కష్టపడి సంపాదించిన డబ్బుని మంటల్లో పారేస్తావా?
రామయ్య ఆప్యాయంగా కుమారుణ్ని కౌగలించుకుని “చూశావా, నువ్వు కష్టపడి సంపాదించావు గనుక నీకు ఆ డబ్బు విలువ తెలిసింది. నిన్నా, మొన్నా నేను సంపాదించిన డబ్బు గనుక అది మంటల్లో పారేసినా నీకు బాధ అనిపించలేదు. ఇప్పటికైనా కష్టపడి సంపాదించిన డబ్బు వృధా అవుతుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నా. ఇన్నాళ్లూ నా శ్రమ ఫలితాన్ని నువ్వు వృధా చేస్తుంటే నేనుపడిన బాధ కూడా ఇలాంటిదే” అన్నాడు. ఆరోజునుంచి సోమయ్య సోమరితనానికి స్వస్తి చెప్పి, తండ్రికి చేదోడువాదోడుగా శ్రమించసాగాడు.