ఆడపిల్ల పుట్టింట ఆడుతూ పాడుతూ పెరిగినా, అత్తవారింట బాధ్యతలు మోయక తప్పదు. అప్పటివరకూ పుట్టినింట్లో తల్లి సంరక్షణలో ఉన్న వధువు అత్తవారింటికి వెళ్లిన తర్వాత తానూ ఒక ఇంటిని సంరక్షించాల్సిన అవసరం ఉంటుంది.
తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సంతోషకరమైన జీవితం గడపడానికి ఆమె ఆరోగ్యం ఎంతో కీలకమైనది.
మునుపటి కన్నా ఆమె ఆరోగ్యం పై శ్రద్ధ మరింత అవసరమౌతుంది. మానవ ప్రయత్నం తో పాటు ఆమెకి దైవబలం చేకూర్చడానికి యజుర్వేద క్రమం లో జరిగే వివాహాలలో వధువు ఆరోగ్యం కోసం అపాల దేవిని పూజిస్తారు.
అపాల దేవి ఎవరు?
వేదాలలో 27 మండి స్త్రీలు మంత్ర ద్రష్టలుగా కనిపిస్తారు. వాళ్ళలో దాదాపు అందరూ ఒకానొక శక్తికి ప్రతీకగా చెప్పబడ్డవారే.
కానీ మానవ రూపం కలిగి ఉండి, మంత్రాధిష్టాన దేవత గా ఉన్నది “అపాల” మాత్రమే. ఈమెనే “ఘోష” అని కూడా అంటారు.
ఈమె తాత అయిన దీర్ఘ తమసుడు ఆరోగ్యాన్ని ప్రసాదించే అశ్వనీ దేవతలను స్తుతిస్తూ వేదాధ్యాయాలను కూర్చాడు. ఈమె తండ్రి పేరు కాక్షీవతుడు.
అపాల యవ్వనం లో కుష్టురోగిగా, అవివాహితగా అత్యంత బాధా కరమైన జీవితాన్ని అనుభవించింది. ఆమె ఆ బాధలను భరించలేక ఆత్మత్యాగం చేసుకోబోతూ చివరిక్షణాలలో అశ్వనీ దేవతలను స్తుతించింది.
ఆ స్తుతికి సంతోషించిన అశ్వనీ దేవతలు ఆమెను ఆరోగ్యవంతురాలిగా చేసి కళ్యాణ భాగ్యాన్ని ప్రసాదించారు.
యజుర్వేదం లో 28 శ్లోకాలలో ఆమెను గురించిన ప్రశంశ ఉంటుంది. నవ వధువులకు ఆమె ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.