ఒక ఊళ్లో శరభయ్య, రాజయ్య అనే మిత్రులు డబ్బు విషయంలో తగాదాపడి తీర్పు కోసం గ్రామాధికారి దగ్గరకు వెళ్లారు.
“అయ్యా! సంవత్సరం కిందట పట్నంలో ఉండే తన తల్లికి జబ్బుగా ఉందని వైద్యం కోసం వెయ్యి రూపాయలు అప్పుగా ఇస్తే మూడు నెలల్లో తీర్చేస్తానని బతిమాలు కున్నాడండీ ఈ రాజయ్య, జాలిపడి అతనడిగిన డబ్బు చేబదులుగా ఇచ్చానండీ. ఏడాది గడిచిపోయినా నా డబ్బు తిరిగి ఇవ్వలేదండి. అదేమని అడిగితే, అసలు నీ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకున్నాను? అని దబాయిస్తున్నాడు” ఫిర్యాదు చేశాడు శరభయ్య.
అది విన్న గ్రామాధికారి రాజయ్యకేసి తిరిగి, “శరభయ్య చెప్పింది నిజమేనా?” ప్రశ్నించాడు.
“అబద్దమండీ. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. ఆమెకి వైద్యం చేయించడం ఏమిటండీ విడ్డురం కాకపోతేనూ, నేనెవరి దగ్గరా ఒక్క రూపాయి తీసుకోలేదు” తెగేసి చెప్పాడు రాజయ్య.
అప్పుడు గ్రామాధికారి శరభయ్యవైపు తిరిగి, “రాజయ్యకు వెయ్యి రూపాయలిచ్చానంటున్నావు కదా. రుణపత్రం ఏమైనా రాయించుకున్నావా?” అడిగాడు.
“ఇరుగుపొరుగు వాళ్లం. రెండేళ్లనుంచీ స్నేహంగా ఉంటున్నాం. రాజయ్య మాటమీద నమ్మకంతో పత్రం రాయించుకోవాలనే ఆలోచనే నాకు కలుగలేదండీ” అన్నాడు శరభయ్య.
“పోనీ వేరే సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా?” మళ్లీ అడిగాడు గ్రామాధికారి.
“పొరుగూరి సంతలో సరుకులమ్మకుని నేను తిరిగి వస్తుంటే ఊరవతల చింతచెట్టు కింద నన్ను కలిసి తన కష్టం చెప్పుకున్నాడండీ. అతని మాటలు నమ్మి వెంటనే వెయ్యి రూపాయలు ఇచ్చానండీ. మేమిద్దరం కలిసి ఆరోజు చింతకాయలు కోసుకుని చెరోసంచి నిండా ఇంటికి తెచ్చుకున్నాం కూడా. ఆ చింతచెట్టే నాకు సాక్ష్యం” చెప్పాడు శరభయ్య.
అందుకు గ్రామాధికారి నవ్వుతూ ‘ కాని చింతచెట్టు సాక్ష్యం చెప్పలేదుకదా” అన్నాడు.
వెంటనే రాజయ్య అందుకుని, “అయ్యా! అంతా ఒట్టిదండీ. అసలు ఈ ఊరవతల ఒక చింతచెట్టు ఉందనే సంగతే నేనెరగనండీ” అన్నాడు దీనంగా ముఖం పెట్టి.
గ్రామాధికారి కొంతసేపు మౌనంగా ఉన్న తరువాత ఒక నౌకర్ని పిలిచి ఇంటిలోపల్నుంచి ఒక సంచి తెప్పించి, “శరభయ్యా! చింతచెట్టు అనగానే నాకు గుర్తోచ్చింది. ఇప్పడు చింతకాయల కాలంకదా. మా పిల్లలకి చింతకాయ పచ్చడంటే మహా ఇష్టం. నువ్వు చెప్పిన ఆ చింతమాను దగ్గరకి పోయి ఈ సంచినిండా చింతకాయలు తీసుకురా. ఆలోపల ఏమి తీర్పు ఇవ్వాలో ఆలోచిస్తాను” అని సంచిని శరభయ్య చేతికి ఇచ్చాడు.
సంచి తీసుకువెళ్లిన శరభయ్య ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి గ్రామాధికారికి అనుమానం వేసి “రాజయ్యా! ఆ చింతచెట్టు దగ్గరికి వెళ్లిన మనిషి ఇంకా తిరిగి రాలేదేమిటి? ఈ వీధి చివరదాకా వెళ్లి శరభయ్య వస్తున్నాడేమో చూసిరా” అన్నాడు.
వెంటనే రాజయ్య “ఆచింత చెట్లు ఇక్కడికి చాలాదూరమండీ. పోయిరావడానికి ఎంతలేదన్నా గంట, గంటన్నర పడుతుంది” అన్నాడు చటుక్కున.
అదివిన్న గ్రామాధికారికి దోషి ఎవరో అర్థమైపోయింది. అయితే చింతచెట్టు గురించి నీకు బాగా తెలుసన్నమాట” అన్నాడు రాజయ్యకేసి సూటిగా చూస్తూ.
అవమానంతో తల దించుకున్నాడు రాజయ్య.
శరభయ్య చింతకాయల సంచితో తిరిగి వచ్చాక, రాజయ్యకి జరిమానా విధించి అతని చేత శరభయ్యకి రావలసిన వెయ్యి రూపాయలు ఇప్పించాడు గ్రామాధికారి.
నీతి: ఎప్పడూ ఎవరూ మోసం చేయకూడదు. మోసం ఎలాగైనా బయటపడుతుంది. అవమానం జరుగుతుంది.