మనోనిగ్రహానికి మార్గం

0
745

చిన్నపిల్లవాడి నుండి పండు ముసలివాడి వరకు ప్రతి ఒక్కరినీ పట్టి పీడించే కష్టం మానసికచింత. ప్రతీ ఒక్కరి నుండి సాధారణంగా వినిపించేది మనస్సు గురించే. ముఖ్యంగా నేటి రోజులలో మానసిక చింతలు బాగా పెరిగిపోయాయి. దానికి అందరు ‘మానసిక ఒత్తిడి’ అనే క్రొత్త పేరు కూడ పెట్టారు. పూర్వం దానిని ‘మానసిక సంక్షోభం’ అనేవారు. ముఖ్యంగా ఇది విద్యార్థులలో పరీక్షా సమయాలలో, ఇంటర్వ్యూ సమయాలలో, ఎంట్రెన్స్ పరీక్షల సమయంలో, ఆటల పోటీలలో కలుగుతూ ఉంటుంది. అయితే ఈ మానసిక ఒత్తిడి క్రొత్తదేమీ కాదు.

భగవద్గీతలో ఈ విషయము చర్చించబడింది. భగవద్గీతలో శ్రీకృష్ణార్జునుల మధ్య చర్చ జరిగింది. ఒక చోట అర్జునుడు శ్రీకృష్ణునితో మాట్లాడుతూ మనోనిగ్రహం చాలా కష్టమని, దానిని సాధించడం వాయువును నిగ్రహించడమంతగా కష్టమని తెలియజేశాడు. వాయువును నిరోధించడం ఎవ్వడి తరమూ కాదు. అలాగే మనస్సును నిగ్రహించడం కూడా అత్యంత కష్టమని అర్జునుడు అన్నాడు. దానికి సమాధానంగా గీతాచార్యుడు ఒక అద్భుతమైన మనోనిగ్రహ పద్ధతిని తెలియజేశాడు.

శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికాడు:

“ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జునా! చంచలమైన మనస్సును నిగ్రహించడం నిస్సందేహంగా చాలా కష్టమేయైనా దానిని తగిన అభ్యాసంతో, వైరాగ్యంతో సాధించవచ్చును” (భగవద్గీత 6.35).

మనస్సు చంచలమైనదని సాక్షాత్తుగా భగవంతుడే అంగీకరించాడు. ఇది అందరి అనుభవము లోనిదే. మనస్సు ఒక్క క్షణమైనా ఖాళీగా కూర్చోలేదు. అసలు మనస్సు అంటే ఏమిటి? కేవలం అది ఆలోచనల పరంపర. జరిగినవి,

జరుగుతున్నవి లేదా జరుగబోతాయని ఊహించేవి అనే మూడు రకాల ఆలోచనలే మనస్సు, ఈ మూడు కార్యాలలో మనస్సు తలమునకలై ఉంటుంది. గడచిపోయిన విషయాలను తలచుకుంటూ మనస్సు క్రుంగిపోతూ ఉంటుంది, జరుగబోయేవాటిని ఊహించుకుంటూ భయపడుతూ ఉంటుంది. నిజానికి అది ప్రస్తుత విషయాలను ప్రక్కకు పెట్టేస్తుంది. అంటే అది ప్రతీక్షణం అటుఇటు దుముకుతూ ఉంటుంది. పాతవిషయాలను తలచుకోవడంవల్ల నష్టమే ముంది లేదా భవిష్యత్తు గురించిన ఊహలవల్ల కలిగే నష్టమేముంది అంటూ ప్రశ్నించడంలో అర్థం లేదు.

ఎందుకంటే గతంలో జరిగిన కష్టాలను తలచుకొని బాధపడడం వల్ల నిరాశాభావన పెరిగిపోతుంది. అలాగే భవిష్యత్తులో ఏదో ఆపత్తు జరుగబోతుందని భయపడడంవల్ల ఉద్విగ్నత పెరిగిపోతుంది. వీటివలన మనిషిలో ఉత్సాహం, శక్తి, స్ఫూర్తి తగ్గిపోతాయే గాని పెరగవు. అందుకే ఈ రకమైన పాత జ్ఞాపకాలతో, భవిష్యత్తును గూర్చి ఊహలతో కాలం గడపడంవలన ఎటు వంటి లాభం ఉండదు. అయితే ఇది అంత తేలికగా సాధ్యమయ్యేది కాదు. అందుకే అభ్యాసము, వైరాగ్యము అనేవి తప్పనిసరిగా కావాలని గీతాచార్యుడు చెబుతున్నాడు.

అయితే విద్యార్థులు చేయవలసిన అభ్యాసమేమిటి? అలాగే వారు సాధన చేయాల్సిన వైరాగ్యమేమిటి? విద్యార్థులు చేయవలసిన అభ్యాసము లక్ష్యాన్ని ఏర్పాటు చేసి కోవడం, ఆ లక్ష్యాన్ని నిశ్చయంగా సాధిస్తానని పదేపదే స్మరించడం. ఎప్పుడైతే లక్ష్యం ఉండదో మనిషి ఏదీ చేయకుండ ఖాళీగా ఉండిపోతాడు. లక్ష్యసాధనకు పనికిరాని విషయాలను వెంటనే విడిచివేయడం వైరాగ్యం అనబడుతుంది.

ఇటువంటి అభ్యాసము, వైరాగ్యము ద్వారా విద్యార్థులు అతిశీఘ్రంగా మానసికచింత నుండి బయటపడతారు. విజయాలను సాధిస్తారు. అప్పుడు జీవితం ఎంతో ఆరోగ్యవంతం, ఉత్సాహవంతం, ఐశ్వర్యవంతం అవుతుంది.

ఇక పై రోజూ పంచాంగం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజూ మీరు ఏ పని చేయాలో ఏ పని చెయ్యకూడదో తెలుసుకోండి.

మరిన్ని వివరలకు ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి https://play.google.com/store/apps/details?id=com.bytesedge.astrotags

మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి ? | Tips for Helathy Mind in Telugu ?