
Tips for Healthy Mind
మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి ?
Tips for Healthy Mind – మనస్సు ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటుందో చెప్పేదే ఆధ్యాత్మికత.
కృష్ణ పరమాత్మ గొప్ప మానసిక చికిత్సకుడు. గొప్ప ప్రబోధంతో మానసిక స్థైర్యాన్నిచ్చాడు. నరుని (అర్జునుని) నెపంగా పెట్టుకుని నారాయణుడైన కృష్ణుడు నరులందరికీ చెప్పిన మానసిక ప్రబోధమే భగవద్గీత.
లౌకికమైన విషయాలను ఎంతవరకూ తీసుకోవాలో అంతవరకూ తీసుకోవాలి. పనికిమాలిన విషయాలను నిరంతరం ఆలోచిస్తూ దేనికైతే సార్థకత ఉండదో దానిగురించి చింతన చేస్తూ క్రమక్రమంగా మానసిక రోగాలకు గురి అవుతూ ఉంటారు చాలామంది.
మానసిక రోగ చికిత్సకుడి దగ్గరకు వెళ్ళి తిరిగితే రోగానికి పేరు ఒకటి ఇస్తారు తప్ప చికిత్స జరగడం లేదు. అదే భగవద్గీత మొదలైన గ్రంథాలను జాగ్రత్తగా మొదటినుంచి అధ్యయనం చేస్తే అంతకు మించి మానసిక చికిత్సా విధానం ఇంకొకటి దొరకదు.
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే|| 2-62 ||క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి|| 2-63 ||
మానసిక శాస్త్రవేత్తలందరూ తెలుసుకోవలసిన గొప్ప శ్లోకములు ఇవి.
ఆధ్యాత్మికతలో భగవంతుడో, మోక్షమో – ఇలాంటి పారమార్థిక విషయాలను నిరంతరం ధ్యానిస్తూ ఉంటే దానితో సంగం ఏర్పడి, అది పొందాలి అని కోర్కె ఏర్పడి అది పొందలేక పోతున్నాను అని క్రోధం కలిగితే ఆ క్రోధం ఒక సమ్మోహాన్నిస్తుంది. ఆ మోహం బాగుంటుంది. ఆ మోహం ప్రపంచాన్ని మరిచిపోయేది. అప్పుడు బుద్ధి తనదైన అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుడిలో ఐక్యం అవుతుంది.
లోక విషయాలలో నిరంతర విషయ చింతన బుద్ధి నాశనానికి హేతువు అవుతుంది. లౌకిక విషయాల పట్ల తాపత్రయ పడే వారందరూ ఈ శ్లోకాలు గుర్తు పెట్టుకోవాలి.
మనస్సును దేనితో ఎంతమేరకు అంటించాలి అనేది తెలియగలగాలి. అప్పుడు శాంతిగా ఉండగలడు. ఇది ఇహానికీ, పరానికీ పనికివచ్చే అత్యద్భుతమైన మార్గం.