లావు (బరువు) పెరగడానికి మార్గం | Tips to Gain Weight in Telugu
‘ప్రకృతి, సార, సత్వ’… అవి మనిషి మనిషికీ మారుతుంటాయి. సన్నగా ఉండటం, లావుగా ఉండటం, బరువు, పొడవు వంటి అంశాలు వీటి మీదే ఆధారపడి ఉంటాయి.
అయినప్పటికీ మనం పాటించాల్సిన ఆహార విహార నియమాలు, పద్ధతులు సక్రమంగా లేకపోతే అతి సన్నగా ఉండటం, అతిగా స్థూలంగా ఉండటం వంటివి సంభవిస్తుంటాయి.
శరీరంలో కార్టిజోన్ల స్థాయి తగ్గడం, పిట్యూటరీ హార్మోను స్థాయి ఎక్కువ అవడం, చిరకాలంగా బాధిస్తున్న ఇన్ఫెక్షన్లు, టీబీ, టైఫాయిడ్‌ల వంటి ఇతర వ్యాధులు, భయం, ఆందోళన మొదలగు సందర్భాల్లో కూడా సన్నగా ఉండటం జరుగుతుంది.
కొంతమంది కొన్ని అపోహలతో ఆహారం తక్కువ తింటారు. దానివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, ఖనిజలవణాల వంటి పోషకాలు లోపిస్తాయి.
ఇది కూడా ఒక కారణమే. మీరు ఈ కింది ఆహార విహారాలను పాటిస్తూ, సూచించిన ఆయుర్వేద మందులు వాడండి. పైన చెప్పిన కారణాలను గమనిస్తూ ప్రతినెలా బరువు తూచుకుంటే, మీరు మూడోనెలలోనే అనుకున్న ఫలితానికి చేరువ కావడానికి అవకాశం ఉంది.
1. ఆహారం:
ఉదయం, సాయంత్రం అల్పాహారం, రెండుపూటలా మిత భోజనం అమలుపరచండి. రోజూ కనీసం ఐదు లీటర్ల నీళ్లు తాగండి. వంటకాలలో, నువ్వులనూనెకు ప్రాధాన్యం ఇవ్వండి.
ఇడ్లీ, దోశ, మినపరొట్టి వంటి భక్ష్యాలు బరువు పెరగడానికే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి. ముడిబియ్యంతో అన్నం వండుకోండి. అరటిపండ్లు, సపోటా, బొప్పాయి, సీతాఫలం, దానిమ్మ వంటి తాజాఫలాలు తీసుకోండి.
శుష్కఫలాలలో ఖర్జూరం, జీడిపప్పు, బాదం చాలా మంచివి. నువ్వులు, బెల్లం కలిపి చేసిన ‘చిమ్మిలి’ తినండి. ఇంట్లో నెయ్యి వేసి చేసిన పాయసాలు చాలా హితకరం.
బూడిద గుమ్మడికాయతో చేసిన వడియాలు, కేరట్‌హల్వా ఉపయోగకరం. ఉప్పు, కారం చాలా మితంగా సేవించాలి. ఆవునెయ్యి శ్రేష్ఠం. అల్లం, వెల్లుల్లి ఆకలికి, అరుగుదలకు చాలా మంచివి.