5 రోజుల పాటు తిరుమల వెంక‌న్న దర్శనం పూర్తిగా రద్దు!

0
2191

5 రోజుల పాటు తిరుమల వెంక‌న్న దర్శనం పూర్తిగా రద్దు!

పుష్కరానికి ఓమారు జరిగే అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు నెలలో 5 రోజుల పాటు తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శనం పూర్తిగా రద్దు కానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతి 12 సంవత్సరాలకోసారి జ‌రిగే ఈ మహా సంప్రోక్షణ, చివరిగా 2006లో ఈ క్రతువు జరిగింది. ఇందులో భాగంగా వైఖానస ఆగమ నిబంధనల ప్ర‌కారం గర్భాలయం, ఆనందనిలయం చుట్టూ పలు కార్యక్రమాలు జరుగుతాయి. గర్భగుడిలో మరమ్మతులను స్వయంగా అర్చకులే చేస్తారు. అయితే, గతంలో ఆలయాన్ని గంటల తరబడి మూసివేసినా, పరిమిత సమయం పాటు భక్తులకు దర్శనాన్ని కల్పించేవారు.
 
ఇక ఈ సంవత్సరం అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ సెలవుల్లో రావడంతో, భారీగా భక్తులు వస్తే వారు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో దర్శనాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయాలని భావిస్తోంది. ఈ మేరకు భక్తులు తిరుమలకు వచ్చి నిరాశతో వెళ్లే బదులు, ముందే అప్రమత్తం చేయాలని అనుకుంటోంది. ఇప్పటికే ఆ ఐదు రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, ఆర్జిత సేవా టికెట్లనూ టీటీడీ జారీ చేయలేదు. స్వామి దర్శనం పూర్తిగా నిలిపివేయాలన్న విషయమై 24వ తేదీన జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో తుది నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.
 
ఈ ఆర్టికల్ భారత్ టుడే నుంచి సేకరించబడినది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here