సర్వ కామ్యాలను తీర్చే…

0
7156

Basar Temple saraswathi devi

సర్వ కామ్యాలను తీర్చే ఆ క్షేత్రం ఏమిటి?

హైదరాబాదుకు 258 కి.మీ. దూరం లో తెలంగాణా లోని ఆదిలాబాద్ జిల్లాలో గోదావరీ తీరాన గల బాసర క్షేత్రం ప్రపంచం లోనే అరుదుగా కనిపించే సరస్వతీ ఆలయాల లో ఒకటి. వ్యాసుడు ప్రతిష్టించిన కారణం చేత బాసరకు వాసరా పీఠమనే పేరు కూడా ఉంది. అక్షరాభ్యాసాలకు అమ్మవారి ఆలయం పెట్టింది పేరు. నిత్యాన్నదానాలతో హోమాలతో జ్ఞాన సరస్వతీక్షేత్రం అలరారుతూ ఉంటుంది. జ్ఞాన సరస్వతీ సన్నిధిలో  విద్యార్థులు ఉన్నత విద్యల కోసం, ఉద్యోగాల కోసం, గృహిణులు తమ పిల్లల విద్యాభ్యాసాలకొరకు, వివిధ కామ్యాలు నెరవేరడానికి భిక్ష చేస్తారు.

 భిక్ష ఎలా చేయాలి?

ఉదయాన్నే గోదావరీ నదిలో స్నానమాచరించి, ఉతికిన బట్టలు ధరించి, అమ్మవారి నామజపం చేయాలి.

శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణే I

వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే II

అనే శ్లోకాన్ని భక్తితో జపించాలి. ఎర్రని వస్త్రాన్ని తడిపి జోలె లాగా ముడివేసుకోవాలి. భిక్షకి వెళ్ళే ముందు అమ్మవారి దర్శనం చేసుకుని చిటికెడు పూజ కుంకుమను జోలెలో వేసుకోవాలి. భిక్ష కు వెళ్ళేవారంతా కలిసి సమూహంగా మొదటగా వ్యాసమందిరాన్నీ, తరువాత శివాలయాన్నీ , ఆంజనేయుని ఆలయాన్నీ దర్శించుకోవాలి. బాసర క్షేత్రం లో కొన్ని కుటుంబాలు ప్రత్యేకంగా అనేక తరాలనుంచీ భిక్షను వేయడం కుటుంబ ఆచారంగా పాటిస్తారు. వారి వద్దకు వెళ్ళి  ‘ భవతీ భిక్షాందేహి మాతా అన్న పూర్ణేశ్వరీ’ అని భిక్షను స్వీకరించాలి. చివరగా ఆలయ నిత్యాన్నదాన సత్రం లో ప్రసాదాన్ని స్వీకరించి భిక్షలో కొంత కోనేటికి సమర్పించి, అమ్మవారికి మనసులో నివేదించుకుని భుజించాలి. సాయంకాలం వీలుని బట్టి, ఆరోగ్య స్థితిని బట్టి నదీ స్నానమాచరించి, జపం చేసుకుని ,అమ్మను దర్శించుకుని పాలూ,ఫలాలూ భుజించాలి. ఆరోగ్యం సరిగాలేని వారు, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు,ఆకలికి తాళలేనివారు ఫలహారం చేయవచ్చు . ఆ రోజు ఆలయ ప్రాంగణం లో నిద్ర చేయడం తో ఆనాటి దీక్ష పూర్తవుతుంది.

దీక్ష ఎన్ని రోజులు చేయాలి?

ఈ విధంగా ఒక రోజు గానీ, మూడు రోజులు గానీ, ఐదు, లేదా ఏడు రోజులు గానీ, పదకొండు రోజులు గానీ, ఇరవై ఒక్క రోజులు గానీ శక్తి కొలది భిక్ష చేయవచ్చు.

శ్రీ జ్ఞాన సరస్వతీ కృపా కటాక్ష సిద్ధిరస్తు. శుభమ్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here