చిరిగిన చీర | Story of Torn Saree in Telugu

0
3247
చిరిగిన చీర | Story of Torn Saree in Telugu

పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలో మకాం చేస్తున్నప్పుడు కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజ చెయ్యాలని తలచి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేశారు.

శ్రీకార్యం వ్యక్తులు కామాక్షి అమ్మవారిని చక్కగా అలంకరించారు.

మహాస్వామి వారు ఇక పూజ మొదలుపెట్టబోతూ, కామాక్షి అమ్మవారికి కట్టిన చీర మోకాలు వద్ద కొద్దిగా చినిగి ఉండడం గమనించారు.

అమ్మవారికి కట్టీన చీర మార్చకుండా అలాగే పూజ కొనసాగించాలని నిశ్చయించుకున్నారు స్వామివారు. పూజ చాలా అద్భుతంగా జరుగుతోంది. ఆ పూజను తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు.

హఠాత్తుగా, చాలా చోట్ల చినిగి ఉన్న వస్త్రం ధరించిన ఒక భిక్షకురాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చీర, తినడానికి కాస్త ఆహారం కావాలని అడిగింది.

ఆమె పరమాచార్య స్వామివారిని సమీపించకుండా అక్కడున్న వారందరూ అడ్డుపడుతున్నారు. కాని మహాస్వామివారు ఆమెని అడ్డగించవద్దని తన వద్దకు రానీయమని ఆదేశించారు.

కరుణాసాగరుడు స్వామివారుl ఆమెకేం కావాలని అడిగారు. తన దగ్గర ఈ చినిగిపోయిన చీర మాత్రమే ఉన్నదని, కావున ఒక మంచి చీరను ఇప్పించమని వేడుకుంది.

ఒక మంచి చీర, పళ్ళు, ప్రసాదం ఒక పళ్ళెంలో తీసుకొనిరమ్మని పరమాచార్య స్వామివారు శ్రీకార్యాన్ని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం వారు అలాగే తీసుకునివచ్చి ఆమెకు అందించారు.

స్వామివారు నవ్వుతూ ఆమెని బావుండమని ఆశీర్వదించారు. ఆమె ఆ పళ్ళాన్ని తీసుకుని రోడ్డువైపుకు వెళ్ళింది.

ఇలాంటి వారు ఆ చీరను డబ్బుకోసం అమ్ముకుంటారని తలచి శ్రీకార్యం వ్యక్తి ఒకరు ఆమెను అనుగమించి వెళ్ళారు. ఆమెకు, మహాస్వామి వారికి తెలియకుండా అతను ఆమెని వెంబడిస్తున్నాడు.

ఆమె రోడ్డును దాటి ఒక దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా, ఎవరో ఇతణ్ణి గట్టిగా చరచడంతో మూర్చవచ్చి నేలపై పడిపోయాడు.

ఆమె ఆలయం లోపలికి వెళ్ళీ అదృశ్యమైపోయింది. దారిన వేళ్తున్న వారి సహాయంతో పూజామండపానికి తిరిగొచ్చాడు.

ఈ సంఘటనను మహాస్వామివారికి చెప్పడానికి అతను చాలా భయపడ్డాడు. ఎవరూ ఏమీ చెప్పకుండానే మహాస్వామివారికి అంతా తెలుసు.

అతణ్ణి నిలదీయడంతో తను కళ్ళు తిరిగి పడిపోయేదాకా జరిగిన విషయం మొత్తం చెప్పాడు. తను చేసిన పనికి క్షమించవలసిందిగా వేడుకున్నాడు.

అమ్మవారికి చిరిగిపోయిన చీర కట్టారని, అందుకే అమ్మవారు చిన్న లీల చేయదలచి ఇలా చేసిందని తెలిపారు. నిజమైన భక్తుణ్ణి కరుణించడానికి అమ్మవారు ఎంత కిందకైనా దిగి రాగలదు.

అలాగే పరమాచార్య స్వామివారు కూడా, ఎందుకంటే అమ్మవారే పరమాచార్య స్వామి కాబట్టి.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

— శ్రీ ఇంద్రా సౌందరరాజన్, కంచియిన్ కరుణై కడల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here