
తరగని వజ్రాల గని వజ్రేశ్వరీ ఆలయం | Vajreswari Temple (Goddess of Diamonds) in Telugu
భారతదేశం లోని యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటి హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా గ్రామం లో గల బ్రజేశ్వరీ దేవి ఆలయం ఆమే వజ్రేశ్వరీ దేవి.
తన తండ్రి దక్ష ప్రజాపతి చేసిన యాగానికి సంతోషంగా వెళ్ళిన సతీదేవి అక్కడ తన భర్తకు జరిగిన అవమానం భరించలేక యజ్ఞకుండం లో దూకి ప్రాణత్యాగం చేసుకుంటుంది. ఆమె మరణానికి ఉగ్రుడై ఆమె మృతకాయాన్ని చేతులపై మోస్తూ ప్రళయ భీకరుడైన రుద్రుని చూసి విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క ఖండాలుగా చేస్తాడు. రుద్ర తాండవం చేస్తున్నఆ మహాదేవుని కదలికలకు ఆమె శరీర భాగాలు భూమిపై 51 చోట్ల పడ్డాయి. ఒక్కొక్క భాగం ఆ పరాశక్తి పీఠంగా రూపు దిద్దుకుంది. ఆ మంచు కొండల్లో పడ్డ అమ్మవారి కుడి స్తనం వజ్రేశ్వరీ ఆలయమైంది.
మహాభారతకాలం లో పాండవులు అరణ్య వాసం చేస్తున్నప్పుడు అమ్మవారు ఆదేశించగా వారు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇతిహాసగాథ. ఈ ప్రాంతం లో నే అమ్మవారు కాళికా రూపమై వజ్రాసురుడనే రాక్షసుడిని సంహరించిందని అందుకే ఆమె వజ్రేశ్వరీ దేవి అయిందనీ ఒక గాథ.
మహమ్మద్ ఘజనీ ఎన్నోసార్లు ఆలయాన్ని కొల్లగొట్టినా తిరిగి అమ్మవారి ఆలయం వజ్ర వైఢూర్యాలతో నిండిపోయేది. తిరిగి ఫిరోజ్ షా కూడా ఎన్నో సార్లు ఆలయం పై దాడి చేశాడు. కానీ అమ్మవారి సంపద కి ఏ లోటూ రాలేదు. పాండవులు నిర్మించిన ఆలయ కట్టడం భూకంపాలవల్ల సడలినా తిరిగి భారత ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మించింది. అమ్మవారు ఇప్పటికీ సకల సంపదలతో,సర్వార్థ దాయినిగా భక్తుల కోర్కెలను నెరవేరుస్తూనే ఉంది.
భారత రాజధాని ఢిల్లీ నుంచీ కాంగ్రా కు విమాన సదుపాయాలు ఉన్నాయి. NH88 రహదారి గుండా షిమ్లా మీదుగా కాంగ్రా గ్రామానికి చేరుకోవచ్చు, అక్కడి నుంచీ ఆలయం రెండు కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. వేసవి కాలం ఆలయదర్శనానికి ఉత్తమమైనది.