
Vamana Jayanti
1వామన జయంతి
ఒకసారి దైత్యరాజైన బలిచక్రవర్తి యుద్దంలో ఇంద్రుని చేతిలో ఓడిపోతాడు. తన గురువు అయిన శుక్రాచార్యుణ్ణి శరణువేడుకొంటాడు.
అప్పుడు శుక్రాచార్యుడు, బలిచక్రవర్తిలోని దివ్యభావాన్ని మేల్కొలుపుతాడు. కొంతకాలానికి గురువు అయిన శుక్రాచార్యుని కృపవలన, బలిచక్రవర్తి స్వర్గం పై దండెత్తి, ఇంద్రుని ప్రాలదోలి, తన అధికారాన్ని స్థాపిస్తాడు.
దేవతలకు ప్రభువుగా ఉన్న ఇంద్రుడు దిక్కులేనివాడయ్యాడు. ఇది అంతా దైవలీల. ఇంద్రుడు ఏమి చేయుటకు తోచనివాడై, అనేక ప్రదేశాలలో తిరిగి.. తిరిగి… చివరకు తన తల్లి అయిన అదితిని శరణు కోరుతాడు.
తన కుమారుని దుర్దశను చూచి, ఆమె మనస్సు తల్లడిల్లింది. తన కుమారుని దుఃఖాన్ని చూచి మిక్కిలి పరితపించినదై-పయోవ్రతాన్ని ఆచరిస్తుంది.
వ్రతము పూర్తి అవుతున్న సమయంలో శ్రీహరి ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో ఇలా అంటున్నాడు – “అమ్మా! నీవు చింతింపకము, నేను నీకు పుత్రుడనై జన్మిస్తాను.
ఇంద్రునకు తమ్ముడనై మేలు చేసెదను” అని శ్రీమహావిష్ణువు ఆమెతో చెప్పి అంతర్ధానమయ్యాడు.
శుభసమయము రానే వచ్చింది. అదితిగర్భమున శ్రీహరి వామనరూపమున అవతరించాడు. భగవంతుడైన శ్రీమహావిష్ణువును పుత్రునిగా పొందిన అదితి, అంతులేని పరమానందాన్ని పొందింది.
వామనుడై అవతరించిన శ్రీహరిని చూచిన బ్రహ్మాదిదేవతలు, మహర్షులు మిక్కిలి ఆనందాన్ని పొందారు. కశ్యపునిద్వారా ఆ వామనమూర్తికి వారు ఉపనయనాదిసంస్కారాలు జరిపించారు.
సరిగ్గా, అదే సమయములో బలిచక్రవర్తి యాగము చేస్తున్నాడు. ఆ విషయం వామనునికి తెలిసి వెంటనే అక్కడికి బయలుదేరాడు. వామనుడు నడుమున ముంజిని, భుజముపై యజ్ఞోపవీతాన్ని ధరించియున్నాడు.
చంకలో మృగ చర్మాన్ని శిరమున జడలు కలిగియున్నాడు. ముఖము తేజస్సుతో ఉట్టి పడుచున్నది. బ్రాహ్మణబ్రహ్మచారి వేషములో వామనుడు బలిచక్రవర్తియొక్క యాగశాలలో ప్రవేశించాడు.
బలిచక్రవర్తి ఆ మహాత్ముని దివ్యతేజస్సును చూచి పులకితుడాయెను. ఆ స్వామిని ఉత్తమమైనఆసనమున కూర్చుండబెట్టి, ఆ స్వామికి అతిథిపూజాపురస్కారం చేసెను.
పూజాసత్కారములు అయిన తర్వాత బలిచక్రవర్తి వామనుని ఏదైనా కోరుకొనుము అని ప్రార్థించెను. అప్పుడు వామనుడు మూడడుగుల భూమిని మాత్రమే, కోరెను.
శ్రీహరిలీలలను గ్రహించిన శుక్రాచార్యుడు వామనునికి దానము ఇవ్వద్దని చెప్పెను. ఆడినమాటను తప్పనివాడైన బలిచక్రవర్తి అందుకు సమ్మతించలేదు.
దానమును ధారపోయుటకై బలిచక్రవర్తి జలపాత్రను చేతిలో పెట్టి వామనునకు దానజలమును ధార పోయగా వామనుడు ఒకపాదముతో భూమిని, మరొకపాదంతో ఆకాశమును ఆక్రమించెను.
మూడవ పాదమునకు చోటు చూపుమనగా బలిచక్రవర్తి, ఆ స్వామికి తన శిరమును అప్పగించెను. బలిచక్రవర్తి తన ఆత్మసమర్పణాభావంతో శ్రీహరి ప్రసన్నుడయ్యెను.
బలికి పాతాళలోక రాజ్యమును అప్పగించి, ఇంద్రుణ్ణి స్వర్గమునకు ప్రభువును చేసెను.
మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.