వటసావిత్రీ వ్రతం

0
389

Vat Savitri Vrat in Telugu- 2022

భారతీయ స్త్రీ, పాతివ్రత్యధర్మనిష్ఠ సూర్యోదయాన్ని ఆపగలిగింది. రావణుడివంటి ప్రతాపశాలిని భయకంపితుని చేసింది. త్రిమూర్తులకే బాల్యం కల్పించగలిగింది. యమునినే జయించి భర్త సూక్ష్మశరీరాన్ని పొందగలిగింది. ఉత్తమురాలైన స్త్రీ మనసులో కలలోనైనా పరపురుషుని చింత ఉండదు అంటాడు తులసీదాసు.

అశ్వపతి, మాళవి దంపతుల కుమార్తె అయిన సావిత్రి ద్యుమత్సేనుడి కుమారుడు అయిన సత్యవంతుడికి ఇక ఒక్క సంవత్సరమే ఆయుర్దాయమని తెలిసీ, మనసిచ్చిన కారణంచేత వివాహ మాడింది.

సత్యవంతుడు వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. అతడు గొడ్డలి చేతబట్టి అడవిలో కట్టెలు – కొట్టడానికి బయలుదేరాడు. సావిత్రి కూడా అతడివెంట నడిచింది. సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి చెట్టు పైకి ఎక్కి తలతిరుగుతున్న కారణంచేత గొడ్డలి కింద పడేసి, క్రిందకు దిగి, సావిత్రి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. 

అప్పుడు యమధర్మరాజు చేతి లో పాశం పట్టుకుని సత్యవంతుడి ప్రాణాలు తీసుకోవడానికి వచ్చాడు. కానీ సావిత్రిలోని ధర్మనిష్ఠ,జ్ఞానం, వివేకం, పతివ్రతా లక్షణాలు యమధర్మరాజు మనస్సుని కరిగించాయి. సత్యవంతుని ప్రాణాలను తన పాశం నుండి విడిచి పెట్టాడు. వినయంతో సావిత్రి యమధర్మరాజుకి నమస్కరించింది. సావిత్రి సత్యవంతుని ప్రాణాలు తీసుకుని, భర్త పార్థివ శరీరం ఉన్న వటవృక్షం దగ్గరకు వచ్చింది. వట వృక్షానికి నమస్కరించి ప్రదక్షిణ చేసింది. అదే సమయంలో సత్య వంతుడు ప్రాణాలతో లేచి కూర్చున్నాడు. భారతీయ సతీధర్మం ఇలా మృత్యువునే జయించింది. అప్పటి నుంచి స్త్రీలు వటవృక్షాన్ని, సావిత్రిని పూజిస్తున్నట్లు; ‘వటసావిత్రీ వ్రతం’ అమల్లోకి వచ్చినట్లు కథనం.

వటసావిత్రీ వ్రతం: 

వ్రతాన్ని చేసేవారు ముందురోజు ఉపవాసం వుండి, ఆ తర్వాత రోజు తెల్లవారుఝామునే నిద్రలేచి, తలస్నానం చేసి, పూజా వస్తువులను తీసుకొని, వటవృక్షం వద్దకు వెళ్లి చెట్టుమొదలు శుభ్రం చేసి, అలికి ముగ్గులు పెట్టి, సావిత్రీ సత్యవంతులను ప్రతిష్ఠించాలి. వారి చిత్రపటాలు దొరక్కపోతే పసుపుతో చేసిన బొమ్మలను ప్రతిష్ఠించుకుని, ముందు వినాయకుడిని, తర్వాత వరుసగా సావిత్రీ సత్యవంతులను, యమధర్మరాజు, బ్రహ్మదేవుడిని, వటవృక్షాన్ని పూజించి, పూజానంతరం ‘నమో వైవస్వతయా’ అనే మంత్రాన్ని పఠిస్తూ వటవృక్షానికి దారం చుడుతూ 108 ప్రదక్షిణలు చేసి, నైవేద్యం సమర్పించి, ముత్తయిదువులకు, బ్రాహ్మణునికి దక్షిణ, తాంబూలాదులను సమర్పించాలి. ఇలా మర్రి చెట్టుకి దారాన్ని చుట్టడం వల్ల, మర్రిచెట్టు యొక్క దీర్ఘాయుర్దాయంతో తన భర్త ఆయుర్దాయాన్ని బంధించినట్లవుతూ తన ఐదవతనం వర్ధిల్లుతుందనేది ప్రతి ఇల్లాలి నమ్మకం మరియు కోరిక. ఆ విధంగా వ్రతమాచరించి వ్రతకథను చదువుకోవడమో లేక పురోహితుని ద్వారా కథను వినడమో చేయాలి.

వటసావిత్రీవ్రతం అమావాస్యనాడు చేయడం లోకవిధానం. భవిష్యోత్తరపురాణం, నిర్ణయసింధులో వటసావిత్రీ వ్రతం జ్యేష్ఠ మాసం అమావాస్య నాడు ఆచరించాలని ఉంది. అయితే కొందరు జ్యేష్ఠశుద్ధ పూర్ణిమనాడు చేసుకుంటారు. వివాహిత స్త్రీలు అందరూ ఈ వ్రతం చేయడం మంచిది. కుజదోషపీడిత కన్యలు, త్వరగా వివాహం జరగడానికి, కలకాలం దాంపత్య సుఖానికి ఈ వ్రతం చేయడం శుభప్రదం.

సావిత్రీవ్రత ప్రభావం వల్ల ముత్తయిదువుల సౌభాగ్యం అక్షయమవుతుంది. వారికి వైధవ్య దుఃఖం నుండి విముక్తి లభించి, మంచి సంతానం కలగుతుంది. వారి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది.

– డా|| అహల్యాదేవి

జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? – Jyeshtha pournami Importance in Telugu