తీర్పు

0
1707

సోమలాపురంలో శాంతయ్య అడవిలో కట్టెలు కొట్టి అమ్మేవాడు. పేరుకు తగ్గట్టు అతను శాంత స్వభావి, నెమ్మదస్తుడు. తన కష్టాన్ని నమ్ముకొని జీవనం చేసేవాడు. అదేవీధిలో ఉన్న రుద్రయ్య ఉదరపోషణకై పల్లెల్లో పూసలు అమ్మేవాడు. అతనికి కోపం ఎక్కువ. ఆవేశపరుడు. అతనికెప్పుడూ ఇతరుల సొమ్ముపైనే కన్ను.

ఒకనాడు అడవిలో కట్టెలు కొడుతున్న శాంతయ్య ఆకలెయ్యడంతో పని ఆపి, గొడ్డలిని గుట్టమీద పెట్టి,

రొట్టెలు తినటానికి చెట్టుకిందికి చేరాడు. రుద్రయ్య పూసల పెట్టెతో పక్కనున్న కొట్టాలపల్లెనుంచి తిరిగివస్తూ గుట్టమీద గొడ్డలిని చూశాడు. గుట్టుగా దాన్ని తీసుకొని వడివడిగా నడిచి ఇల్లు చేరాడు. శాంతయ్య వచ్చి చూసేసరికి గొడ్డలి లేదు. తాను తినటానికి కూర్చున్నపుడు ఆ దారినే ఇంటికెళ్లిన రుద్రయ్య పనే అయ్యుంటుందనుకున్నాడు. వెళ్లి గొడ్డలి అడిగాడు.

“నీ గొడ్డలి నేనెందుకు తీసుకుంటాను?” అన్నాడు రుద్రయ్య.

శాంతయ్య, గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు. ఈ సంగతి ఊరంతా పాకింది. గ్రామాధికారి రుద్రయ్యను పిలిపించాడు.

“నేను శాంతయ్య గొడ్డలి దొంగిలించలేదు, ఇంట్లో ఉన్నది నా గొడ్డలి” అన్నాడు రుద్రయ్య. గ్రామాధికారి రుద్రయ్య వద్ద ఉన్న గొడ్డలిని తెప్పించాడు. 

“ఆ గొడ్డలి నాదే” అన్నాడు శాంతయ్య. “రుద్రయ్యా, ఈ గొడ్డలి శాంతయ్యది కాదని నాదేనని అంటున్నావు. వృత్తిరీత్యా పూసలమ్ముకునే నీకు గొడ్డలితో పనేమిటి?” అడిగాడు గ్రామాధికారి.

“అయ్యా! పూసలవ్యాపారం సవ్యంగా సాగటంలేదు, నష్టాల ఊబిలో కూరుకుపోయాను. అందువల్ల ఆ వ్యాపారానికి ప్రత్యామ్నాయంగా గొడ్డలి కొని జీవనోపాధికి కట్టెలు కొట్టడం మొదలెట్టాను”.

“నీవు ఎన్నాళ్లనుంచి కట్టెలు కొడుతున్నావు?”

ఈ ‘మూడుమాసాలనుంచి” అన్నాడు రుద్రయ్య.

గ్రామాధికారి ఓ క్షణం ఆలోచించి “శాంతయ్యా, నీవు ఆ గొడ్డలితో చెట్టుకొమ్మలు రెండు నరికి కట్టెలమోపు కట్టు” అన్నాడు.

శాంతయ్య కొంతసేపట్లో ఆ పనిముగించాడు. గ్రామాధికారి “రుద్రయ్యా, ఇప్పుడు నీవు చెట్టుకు అటువైపున్న రెండు కొమ్మలు కొట్టి మోపుకట్టు” అన్నాడు.

రుద్రయ్య ఒడ్డున పడ్డ చేపలా విలవిలలాడాడు. గొడ్డలితో చెట్టు వద్దకెళ్లి మళ్లీ వెనుదిరిగి వచ్చి

“నాకు సుస్తీచేసింది, నేను కట్టెలు కొట్టలేను” అన్నాడు నీరసం నటిస్తూ.

“కట్టెలు కొట్టలేవా? లేక కట్టెలు కొట్టడం రాదా? నిజం చెప్పు” గద్దించాడు గ్రామాధికారి. .

రుద్రయ్య “నాకు కట్టెలు కొట్టడం రాదు, ఈ గొడ్డలి శాంతయ్యదే, తప్పుచేశాను, మన్నించండి” అని చేతులు జోడించాడు.

“మరోమారు ఇలాంటి పాడు పని చేశావంటే నిన్ను ఊళ్లో ఉండనివ్వను” హెచ్చరించాడు గ్రామాధికారి. శాంతయ్య తన గొడ్డలి తీసుకొని సంతోషించాడు.

ప్రజలు గ్రామాధికారి తీర్పును ప్రశంసించారు, రుద్రయ్య తీరును తప్పుపట్టారు.

చివరకు “వీడికిదేం పాడుబుద్ది” అని ఈసడించుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. 

ఖరీదైన చిలగడ దుంప | Expensive Sweet Potato in Telugu