శుభాలనిచ్చే శ్రావణ లక్ష్మీ

0
1308

పద్మాసనే దేవి పద్మప్రియే పర్రబహ్మ ఆ స్వరూపిణి అంటూ మహామాయా రూపిణి శ్రీ పీఠ వాసినిని నిరంతరమూ దేవతలు, మానవులు, రాక్షసులు అనే భేదం లేకుండా పూజిస్తుంటారు. ప్రతిఒక్కరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని మొక్కుకుంటారు. ఇలాంటి ఈ వైకుంఠవాసిని అయిన ఈ లక్ష్మీదేవి ఒక్కసారి దుర్వాసముని శాపం వల్ల సాగర గర్భంలో చిక్కుకుని పోయిందట.

సర్వ దేవతలు ఐశ్వర్యహీనులు అయిపోయారు. వారంతా తమ దారిద్ర్యాన్ని పోగొట్టుమని విష్ణువును ప్రార్థించారు.భక్తవత్సలుడైన దామోదరుడు వారికి అభయాన్ని ఇచ్చాడు. విష్ణు భగవానుని అనుగ్రహం లభించిందని దేవతలు సంతోషించారు. అచ్యుతుని ఆదేశంతో దానవులతో కలిసి వారంతా క్షీరసాగరాన్ని మధించారు. దానిలో ప్రసన్నవదనంతో, నిర్మలచిత్తంతో మహాలక్ష్మి వారికి లభించిందని బ్రహ్మవైవర్తనపురాణం చెప్తోంది.

చంద్రుని సహోదరి కావడంతో చల్లదనానికి, కమలవాసని కనుక వికసిత మనస్సుకూ లక్ష్మిని ప్రతీకగా భావిస్తారు.ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం, ఆరోగ్యం, అష్టసిద్ధులు అప్టైశ్వర్యాలు కలిగించే లక్ష్మీ దేవిని సత్య, భోగ, రాజ్య యోగ, విద్య, సౌభాగ్య అమృత, కామ్య, లక్ష్మీ స్వరూపాలుగానే కాకుండా కోరిన వరాలనిచ్చే వరలక్ష్మీ దేవిగా పూజిస్తుంటారు.

ఈ లక్ష్మీ దేవినే విష్ణువు జన్మనక్షత్రంతో కూడిన శ్రావణ మాసంలో విశేషంగా అర్చిస్తారు.విష్ణువు హృదయవాసినిగా వినుతికెక్కిన ఈ మహాతల్లిని ఈ శ్రావణంలో పూర్ణిమకు ముందేవచ్చే శుక్రవారం నాడు చారుమతి అనే సాధ్వీమణీ పూజించి ఇహపరలోకంలో ఎనలేని సౌఖ్య సంపదలను పొందిందని మహాశివుడు పార్వతికి చెప్పాడని భవిష్యపురాణం చెప్తోంది. కనుక ఈ లోకంలో కూడా కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లిగా వరలక్ష్మీ దేవిని పూజించాలని వరలక్ష్మీ వ్రత కథ చెప్తోంది.

శ్రీ అనే పదం సిరి సంపదలను, శ్రేయస్సును, ఉన్నతిని కలుగచేస్తుంది. శుద్ధ సాత్విక రూపమైన శ్రీ లక్ష్మి భక్తులకు బలానిచ్చే దివ్యశక్తి. ఈ లక్ష్మీ దేవి సాయం సంధ్యగాను, పూవుల ల్లోనూ, దీపాల్లోనూ, పసుపు కుంకుమల్లోనూ, తాంబూలం లోనూ, వెదురులోనూ పండల్లోనూ నివసిస్తుంటుందట. అందుకనే ముత్తైదువులందరూ ఒకరికొకరు తాంబూలాలను ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రతి ఇంటిని సాయంత్రపు పూట దీప తోరణాలు, పూల మాలికలతో అలంకరించి కళకళలాడేటట్టు చేస్తారు. కోరిన వరాలనిచ్చే మహాలక్ష్మీ మహిమల్ని శ్రీసూక్తం వెల్లడిస్తోంది. ఈ తల్లిని సర్వులూ పూజించి తరించుదాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here