ధర్మ శాస్త్రాల ప్రకారం – గర్భవతి పాటించవలసిన ధర్మాలు, అలాగే ఆమె భర్త అనుసరించవలసిన నియమాల ఏమిటి?

0
602

అసలు ఆ నియమాలను ఎందుకు పెట్టారు?

మహర్షుల విజ్ఞానం స్థూల, సూక్ష్మ ప్రపంచాలను దర్శించి ఏర్పరచినది. ఆ రెండింటి ప్రభావం వ్యక్తిపై ఉంటుంది. సూక్ష్మ ప్రపంచంలో ఉండే దైవీశక్తులు సత్ప్రభావం కలిగేలా, విపరీత శక్తుల దుష్ప్రభావం తొలగేలా కొన్ని నియమాలను ఏర్పరచారు. మరికొన్ని భౌతిక ఆరోగ్యాన్ని, మానసిక స్వస్థతను చేకూర్చేలా స్థిరపరచారు. ఈ విధంగా సమగ్రమైన స్వస్థత నియమాలను సమకూర్చిన సమగ్ర విజ్ఞానం ఆ నియమాలలో ఉంది.

ధర్మశాస్త్రాలు చెప్పిన నియమాలు ఇవి:
గర్భిణీ కుంజరాశ్వాది శైలహర్మ్యాధిరోహణం!
వ్యాయామం శీఘ్ర గమనం శకటారోహణం త్యజేత్!!
న భస్మాదా వుపవిశేత్ ముసలోలూఖలాదిషు!
త్యజేజ్జలావగాహంచ శూన్యం సద్మతరోస్తలమ్!!
కలహం గాత్ర భగ్నంచ తీక్షాత్యుష్ణాది భక్షణం!
సంధ్యాయామతి శీతామ్లం గుర్వాహారం పరిత్యజేత్!!
వ్యవాయశోకా సృజ్మోక్షం దివాస్వాపం నిశిస్థితమ్!
భస్మాంగారనఖైర్భూమి లేఖనం శయనం సదా!!
త్యజేదమంగళం వాక్యం నచహ స్యాధికాభవేత్!
నముక్తకేశానోద్విగ్నా కుక్కుటాసన గాన చ!!
గర్భరక్షా సదా కార్యా నిత్యం శౌచనిషేవణాత్!
ప్రశస్తమంత్ర విఖనాచ్చః తమాల్యాను లేపనాత్!
విశుద్ధ గేహవనినాత్ దానైశ్శ్వశ్ర్వాది పూజనైః!!
హరిద్రాం కుంకుమం చైవ సింధూరం కజ్జలం తథా!
కేశసంస్కార తాంబూలం మాంగల్యాభరణం శుభమ్!!
చతుర్థేమాసి షష్ఠేవా ష్యష్టమే గర్భిణీ వధూః!
యాత్రాం వివర్జయేన్నిత్యం ఆపష్థాత్తు విశేషతః!!
గర్భిణీ వాంఛితం ధర్మం తస్యై దద్యాద్యధోచితం!
సూతే చిరాయుషం పుత్ర మన్యధాదోషమర్హతి!!
సింధుస్నానం ద్రుమచ్ఛేదం వపనం ప్రేత వాహనం!
విదేశ గమనం చైవ నకుర్యాద్గర్భిణీ పతిః!!

గర్భవతియైన భార్య కోరిన ఉచితమైన వస్తువును తెచ్చి ఇవ్వడం ముఖ్యం. తద్వారా చిరాయువు కలిగిన పుత్రుడు కలుగుతాడు. లేకపోతే దోషం కలుగుతుంది. (మన శాస్త్రాల ప్రకారం గర్భవతికి ‘దౌహృది’ అని పేరు. అంటే ‘రెండు హృదయాలు కలది’ అని అర్థం. తన హృదయంతో పాటు, లోనున్న్ శిశువు హృదయం కూడా ఆమెద్వారా వ్యక్తమవుతుంది. పరస్పరం ఒకరి భావాల ప్రభావం మరొకరిపై ఉంటుంది.

అందుకే భర్త వ్యక్తపరచే ఆప్యాయత శిశువు కూడా గ్రహిస్తుంది. తండ్రిగా అతడి శ్రద్ధ, జాగ్రత్త శిశువు గమనిస్తుంటాడు. అది శిశువు ఆయుష్షుకి బలాన్నిస్తుంది. అంతేకాక తల్లి చరించే పరిసరాలు, గ్రహించే విషయాలు శిశువు గమనిస్తుంటాడు. వాటి ప్రభావం ఉంటుందని గమనించి సవ్యమైన వాతావరణంలో, చక్కని నియమాలతో తల్లి ప్రవర్తించాలి).

సముద్రస్నానం, చెట్లు నరకడం, క్షౌరం, శవం మోయడం, విదేశప్రయాణం చేయరాదు. (ఇందులో తప్పని పరిస్థితుల్లో క్షౌరం చేసుకోవచ్చు అని కూడా శాస్త్రముంది. క్షౌరం నైమిత్తికం కుర్యాత్ నిషేధౌ సత్యపిధ్రువం)

వపనం మైథునం తీర్థం శ్రాద్ధ భోజన మేవచ!
వర్జయేత్ సప్తమాన్మాసాన్నావారోహరణం తథా!!
యద్ధాది వాస్తు కారణం నఖకేశవికర్తనం!
చౌలం శవానుగమనం…..

ముండనం పిండదానంచ ప్రేతకర్మ చ సర్వశః!
జీవత్పితృకఃయ కుర్యాద్గర్భిణీ పతిరేవచ!!

ఏడవ మాసము నుండి క్షౌరం, మైథునం, తీర్థయాత్ర, శ్రాద్ధ భోజనం, నావనెక్కడం, పనికిరాదు. యుద్ధాదులు, గృహాది నిర్మాణం, నఖ(గోళ్ళు)కేశములు కత్తిరించడం, తల గొరిగించుకోవడం, శవాన్ని అనుసరించి వెళ్ళడం, పిందదానం, పితృకర్మలు చేయడం పనికిరాదు.

అయితే మరణించిన తల్లిదండ్రుల విషయంలో శ్రాద్ధాదులు(ఆబ్దికాలు) చేయవలసినదే. మహాలయ శ్రాద్ధాదులు చేయనక్కరలేదు.

గర్భవతి యైన స్త్రీ ఏనుగు, గుఱ్ఱం, బండి మొదలైనవి ఎక్కి ప్రయాణించకూడదు. పర్వతం, మేడ మొదలైన ఉన్నత ప్రదేశాన్ని ఎక్కకూడదు. వ్యాయామం (ఎక్కువ శ్రమ), వేగంగా నడవడం, పరుగు పెట్టడం కూడదు. బూడిదలోనూ, మలిన వస్తువులందు, రోకలి, రోలు మొదలైన పనిముట్లపై కూర్చోరాదు. నీటిలో మునగడం, శూన్య గృహమందుగానీ, చెట్ల క్రిందగానీ నిలబడడం పనికిరాదు. కలహించడం, ఒళ్ళు విరుచుకోవడం, కారపు వస్తువులు, వేడి వస్తువులు తినడం, సంధ్యలలో భుజించడం మంచిది కాదు. అతిశీతలమైన పదార్థాలను, గాఢమైన పులుపు పదార్థాలను తినరాదు. సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తినాలి.

మైథునం, శోకం పనికిరావు. రక్తం తగ్గించుకోరాదు. అంటే రక్త సమృద్ధి కలిగించే పళ్ళు, కూరలు తినాలి. పగలు నిద్రించడం, రాత్రి ఒంటరిగా మేల్కొనడం తగదు. బూడిదతోను, బోగ్గుతోను, గోళ్ళు మొదలైన వాటితోనూ గీతలు గీయరాదు. ఎప్పుడూ నిద్రపోవడం (అతినిద్ర)తగదు. అమంగళపు వాక్కులను ఏ మాత్రమూ పలకరాదు. అధికంగా నవ్వడం, కొప్పు విప్పుకొని ఉండడం తగదు.

హఠాత్తుగా జడియడం, ఒంటిగ కూర్చోవడం కూడదు. శుచిని వీడరాదు. మంచి సాత్మిక మంతాలతో కూర్చిన రక్షరేకులను ధరించాలి. మంచి మాలికలు, చందనం ధరించాలి, పవిత్రత, దేవారాధన, ఉన్న గృహంలో ఉండాలి, దానాలను చేయాలి. అత్తమామల ఎడ గౌరవ భావంతో ప్రవర్తించాలి. పసుపు, కుంకుమ, సింధూరం, కాటుక మొదలైన వాటితో అలంకరించుకొని, దువ్విన కొప్పుతో మంగళాభరణాలు ధరించాలి. నాలుగు, ఆరు, ఎనిమిది మాసాలలో ప్రయాణం ఎప్పుడూ కూడదు. అందులో ఆరవ మాసం బొత్తిగా కూడదు.

ఇలా మన శాస్త్రాలు సూక్ష్మ విషయ దర్శనాలలో నియమాలను ఏర్పరచాయి. వీటి పాలన వల్ల శిశువు జీవితం సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. ఇలా వైద్య, సూక్ష్మ విజ్ఞాన రహస్యాలతో మన శాస్త్రాలు గర్భిణికి నియమాలను విధించాయి.

భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయవలసిన, చేయకూడని ఆచారములు ఏమిటి ? | Husband Role when Wife is Pregnant in Telugu?