విష్ణుపురాణం తరువాయి భాగం | Vishnu Puranam in Telugu

0
2577
12373325_973499706051217_4653983931741441916_n
విష్ణుపురాణం తరువాయి భాగం | Vishnu Puranam in Telugu

ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుపురాణం పారాయణం గొప్ప ఫలదాయకం.

ఓ పరమాత్మా! పురుషోత్తమా! ప్రధాన వ్యక్తభూతుడవు – కాలాత్మకుడవు అయిన నీకు నమస్కారం. సర్వప్రపంచం ఏకార్ణవమైనపుడు నువ్వొక్కడివే శయనించగా, జ్ఞానులు నిన్నే ధ్యానిస్తుంటారు. నీ పరతత్త్యేతరమైన రూపం అతి గహనం. అదెవ్వరికీ తెలియరానిది. నీవు అవతారం ఎత్తినప్పటి రూపమే దేవతలంతా అర్చించగలరు. నిన్నారాధించని వారికి ముక్తి లభించుట సాధ్యమా? మనోనేత్రాలతో – బుద్ధితో ఏది గ్రహించగలుగుతారో ఆ రూపం నీవే! ముముక్షువులకు కొలవదగిన పరబ్రహ్మానీవే! నేను నీతోనే లీనమైనదాన్ని. నాకు నీవే ఆధారం. నీచేత జనించినందున నారూపం అంతా నీవేనయ్యా మాధవా! కనుకనే లోకం నన్ను ‘మాధవి’ అని గుర్తించింది. ఓ జ్ఞానతేజా! నీకు జయమగుగాక!”

ఈ విధంగా వసుంధరాదేవి చేసిన స్తోత్రం (పైన ఇవ్వబడిన 9 శ్లోకాలు) మొత్తం పారాయణ చేయదగినది. గొప్ప మహిమాన్వితమైనట్టి స్తోత్రమిది. (ఈ క్రింది శ్లోకాలు 4 కూడా ఈ స్తోత్రానికి కొనసాగింపుగా పఠించాలి. కోరిన కోరికలు నెరవేర్చగల శక్తి ఈ స్తోత్రానికి ఉంది అనేది విజ్ఞుల మాట.)

జయాఖిలజ్ఞానమయజయస్థూలమయావ్యయ|

జయాన నంతజయావ్యక్తజయవ్యక్తమయప్రభో ||

పరాపరాత్మ సర్విత్మ జయయజ్ఞపతే నఘ |

త్వంయజ్ఞస్త్వంవషట్కార స్త్వమోంకార స్త్వమగ్నయః

త్వంవేదా స్త్వంతదజ్గానితం యజ్ఞపురుషోహరే|

సూర్యాదయోగ్రహాస్తా రానక్షత్రాణ్యఖిలానిచ ||

మూతా మూత మదృశ్యంచ దృశ్యంచపురుషోత్తమ |

యచ్చోక్తంయచ్చనై వోక్తంమయాత్రపరమేశ్వర ||

తత్సర్వంత్వంనమస్తుభ్యం భూయోభూయోనమోనమః ||

భూదేవి ఈ ప్రకారం సంస్తుతించగా. విష్ణువు సామవేదస్వరంతో ఘర్షరించాడు. హర్షం ప్రకటించాడని అర్థం.

పృధ్వి – ఒక వివరణ

పంచభూతాలలో ఒకటి అయిన పృధ్వి లోకమాత. ఆమె మానవులకు – పశుపక్ష్యాదులకు, సర్వజీవుల మనుగడకు ఆధారం. పృధ్విలోపల అంతులేని సంపద ఉంది అన్ని సంపదలు ఆమెనుండే ఉద్భవిస్తాయి. కనుకనే ఆమెను వసుధ, వసుంధర అని కూడా అంటారు. భూమాత సర్వం తనలో దాచుకుంటుంది. అందువల్ల ఆమెను ‘సర్వంసహా’ అని అంటారు.

పృధ్విది బహు సుందరమైన రూపం. విష్ణువు అర్థాంగి. మధుకైటభులనే రాక్షస్సుల్ని విష్ణువు మర్దించగా, వారి శరీరాల నుంచి వెలువడిన కొవ్వు ఓగుట్టగా ఏర్పడితే, అందులోంచే పృధ్వి సృష్టి జరిగిందని పురాణగాథ. కనుకనే ఆమె ‘మేదిని’ అయింది.

వేదాలలో పృధ్విని ఆకాశానికి జంటగా పేర్కొన్నారు. దయామయి, ప్రశాంతమూర్తి, చైతన్యదాయినిగా కొనియాడారు. పృథివ్యాకాశాలను వేరు పరచి చూడకుండా రెండింటినీ కలిపి దైవపృధ్విగా పిలిచారు. తొలి దంపతులు భూమ్యాకాశాలే. సమస్త సృష్టీ వారి సంతానమే!

పరాశర మహర్షి చెప్తూన్నాడు.

“మైత్రేయా! శ్రీహరి తన కోరలతో ఆ భూదేవిని పాతాళం నుంచి పైకెత్తి, నల్లని మహాపర్వతంలా – నల్లకలువరేకుల్లా వికసించిన కన్నులతో పైకి లేచాడు.

అ ప్రకారంగా పైకెగసిన ఆ వరాహముర్తి విరాడ్రూపం యొక్క ముఖం నుంచి వెలువడిన నిశ్వాసం తాకిడికి పెద్ద పెద్ద కెరటాలు ఏర్పడ్డాయి. ఆ కెరటాలతో పాటు ఎగసిన నీరు జనలోకంలో ఉండే సనకసనందనాదిమునుల పైకి ఎగజిమ్మి వారినందరినీ అతి పవిత్రులను చేసింది. సహజంగానే పవిత్రులైన ఆ మహర్షి సత్తములను ఈజలాలు భగవన్నిశ్వాసంతో పాటు ఇంకా నిర్మలంగా చేశాయని అర్థం!

కోరకొనపై ధరను దాల్చినందున వారంతా హరిని ప్రస్తుతించారు. ఈ విధంగా మునులచే స్తుతులందిన ఆ (ది) వరాహముర్తి భూదేవిని ఉద్ధరించి ఉదక పంక్తి మీద నిల్చాడు. ఆ వరాహమూర్తి శరీరం చాలా మహత్తరమైనది. కనుక, జలములో అది మునిగిపోకుండా గొప్ప ఓడలా ప్రకాసించసాగింది. అప్పుడాభూమిని సరిజేసి, గత సర్గ కాలంలో దగ్థమైనట్టి పర్వతాలను తన అమోఘ మహిమచేత పునఃసృష్టి చేశాడు – పరమాత్మ.

? భూలోకం. భవర్లోకం, సువర్లోకం, పారాళలోకం అనే 4 లోకాలూ తిరిగి యథాతథంగా రూపొందాయి. ఆ తరువాత హరి, రజోగుణప్రధానమైన చతుర్ముఖ బ్రహ్మస్వరూపుడై సృష్టికార్యం చేయడానికి ఉత్సహిస్తాడు. చేయించునది విష్ణువే! విధాత నిమిత్తమాత్రుడే! జీవులు సృజ్యవస్తువులు. వీటి గతజన్మ కర్మవాసనల చేత జననమరణ వస్తుత్వం పొందుతూంటాయి.

courtesy https://www.facebook.com/hindhudarmachkram/?fref=nf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here