శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? ఫలితం ఏమిటి? | Lord Shiva Pushparchana in Telugu?

1
12171
Flower pooja for Lord Shiva
Flower pooja for Lord Shiva

 Lord Shiva Pushparchana in Telugu?

నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.

పుష్పామూలే వసేద్బ్రహ్మ మధ్యేచ కేశవః
పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదలే

పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి.

పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి
త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్

పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడు. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది.

పుష్పైర్దేవాః ప్రసీదంతి పుష్పేదేవాశ్చ సంస్థితాః
కించాతి బహునోక్తెన పుష్పస్యోక్తి మత్రంద్రికామ్.

పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు. ఎందుకంటే వారు పుష్పాలలో నివశిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది.

ఇక, మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడ ప్రస్తావించబడింది. విష్ణువుకు, దుర్గాదేవికి, వినాయకుని రకరకాల పుష్పాలతో పూజించ వచ్చని పేర్కొనబడగా, శివునికి మాత్రం మారేడు ప్రతిచాలన్నట్లుగా చదువుతుంటాం. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి వర్ణించాడు.

శివుని శిరమున కాసిన్ని నీళ్ళుజల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేను వతడింట గాడిపసర
మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు

శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?!

ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి.

శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాదిపోయినవిగా ఉండ కూడదు. కీటకాడులతో కొరకబదినవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూదోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు. ఇంకా పాపం కలుగుతుంది.

శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణవాక్కు.

అదేవిధంగా శివుని ఏయే మాసాలలో ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడ చెప్పబడింది. చైత్రమాసంలో శంకరుని నృత్యగీతాలతో సేవిస్తూ, దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. వైశాఖమాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.

జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామరపువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢమాసంలో కృష్ణ చతుర్ధశినాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమల తోడిమాలతో కూడిన పుష్పాలతో అర్చించినవారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది. శ్రావణమాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుని పూజించినవారికి వేయిగోదానముల ఫలం లభిస్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు. ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుతారు.

కార్తీకమాసంలో శివుని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలరు. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించినవారు పరమ పదాన్ని పొందగలరు. మాఘ మాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించినవారు, లేత సూర్యుడు, చంద్రుడులున్న విమాన,లో పరమపదానికి వెళతారు. ఫాల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.

ఇక, శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.

శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.
వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.

వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.

పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.

సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.

ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.

ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.

ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.

మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.

దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని
శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే

పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది

(BrahmaSri Chaganti Koteswara Rao Gari Pravachanalu)

From: Durgeswara Rao

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here