
రావణ సంహారం అయిపొయింది. యుద్ధం ముగిసిన సందర్భంలో అందరూ సేద తీరుతున్నారు. అప్పుడు రావణుడి సోదరుడైన విభీషణుడు రాముని చెంతకు వచ్చి, లంకను ఏలుకోమంటాడు. రాముడు అందుకు వలదని చెప్పగా లక్ష్మణుడు తన అగ్రజుడి వైపు చూస్తాడు. అపుడు రాముడు లక్ష్మణుడితో
అపిస్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీజన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి
అని చెబుతాడు.
పై శ్లోకానికి అర్థం, “లక్ష్మణా, ఎంతటి స్వర్ణమయమైనదైనా లంక పై నాకు ఎటువంటి ఆశగానీ కొరికగానీ లేదు, కన్నతల్లి, జన్మ భూమి స్వర్గం కన్నా గొప్పవి”.
మనకు కన్నతల్లితో ఎటువంటి గొప్పదైన బంధం ఉంటుందో, జన్మభూమితో కూడా అదే సంబంధం ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా, తిరిగి పుట్టిన నేలపైన అడుగు పెడితే వచ్చే అనిర్వచనీయమైన ఆనందం ముందు ఇంకేదైనా దిగదుడుపే. కన్నతల్లి తాను ఉన్నంతవరకూ బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది, తరువాత పుట్టిన నేల మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందుకే రాముడు పై వాక్యాలను లక్ష్మణుడికి చెబుతున్న నెపంతో ప్రపంచానికంతటికీ చెప్పాడు. ఇందుకే రామాయణం మనకు అత్యంత పూజనీయ గ్రంథమైంది. కాబట్టి రామాయణం చదివాము, ఎవరో మహానుభావుడు రామాయణాన్ని చెబుతుంటే చెవులారా విన్నాము అంటే సరిపోదు. ఆ మహాగ్రంథాల్లో పురాణ పురుషులు చెప్పిన మంచి విషయాలను ఆకళింపు చేసుకుని, ఆచరణలో పెట్టగలగాలి. అప్పుడే హిందూ ధర్మాన్ని రక్షించినవారమవుతాము. ధర్మో రక్షితి రక్షితః అని ఊరికే అనలేదు.
శ్రీ రామ కృపాకటాక్ష ప్రాప్తిరస్తు
జై మహా కాళి _/\_