బ్రహ్మముడి అంటే ఏంటో మీకు తెలుసా? | What Is Brahma Mudi in Telugu

4
12232
11817178_1133089873385299_4416294333046154070_n
బ్రహ్మముడి అంటే ఏంటో మీకు తెలుసా? | What Is Brahma Mudi in Telugu
బ్రహ్మముడి  
 
మనకు వివాహంలో తలంబ్రాలు అనంతరం జరిగే ప్రక్రియ బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడి వేసేటప్పుడు వరుడి ఉత్తరీయం మరియు వధువు యొక్క చీర కొంగు చివర అంచును కలిపి ముడి వేస్తారు.
 
వారి బంధాన్ని పటిష్ఠపరిచే చర్య ఇది. ఇప్పటికీ చూడండి ఏదైనా విడదీయరాని బంధం ఏర్పడితే బ్రహ్మముడి పడిందిరా అని అంటూ ఉంటారు.
 
దీనినే బ్రహ్మగ్రంధి, కొంగులు ముడివెయ్యడం అని కూడా అంటారు. ఇద్దర్ని కలిపి క్రొత్త వ్యక్తిని సృష్టించడం. రెండు శరీరాలు, రెండు మనస్సులు ఏకత్వమవ్వడమన్నది ఇక్కడ చాటి చెప్పబడుతుంది.
 
కొంగుముడిలో నాణెం, పువ్వులు, దర్భలు, పసుపుకొమ్ములు, అక్షింతలు, కందపిలక, ఆకులు, వక్క వేస్తారు. వధూవరుల మీద అక్షింతలు వేస్తూ పురోహితుడు ‘ధ్రువంతేరాజా వరుణో ధృవం దేవో బృహస్పతిహి, ధృవంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రంధారయతాం ధృవం’ అని మంత్రం చదువుతాడు.
 
దాంపత్య సామ్రాజ్యాన్ని ధరించిన మీకు వరుణుడు, బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వం కలుగచేయుదురుగాక అని అర్ధం.
 
ఇంకొక రకంగా పై మంత్రాలకి ‘పూషా’ (దేవతలయందు శ్రేష్టుడైనటువంటివాడు) వెంటతీసుకుని వెళ్ళాలి. అశ్వినీ దేవతలు నీ చేతులు పట్టుకుని రధంపైన తీసుకుని రావాలి. ఇంటి ఇల్లాలిగా అన్నీ తీర్చిదిద్దడానికి నా ఇంటికి రా….
 
ఒక యజమానురాలిగా గృహస్థ ధర్మాన్ని నిర్వహించు. ఇది కేవలం రెండు వస్త్రాలని కలపటం కాదు. ఇద్దరు వ్యక్తులను కలిపి క్రొంగొత్త ఆకారాన్ని సృష్టించడమే దీని లక్ష్యం.
 
నీది అని ఏమీ లేదు. ఎవరు సంపాదించినా దాని మీద అధికారం ఇద్దరికీ ఉంటుంది.
 
ఆదాయం, ఖర్చు, ప్రణాళిక కలిపి ఉమ్మడిగా చెయ్యవలసిన పనులని భావం. దర్భగడ్డి ఎప్పటికి వాడని ప్రేమకి నిదర్శనం.
 
దర్భగడ్డి తన జీవ లక్షణాన్ని కోల్పోదు. కాసిన్ని నీళ్ళు చల్లితే చాలు, మళ్ళీ పచ్చగా మారుతుంది.
 
ఇలా వివాహ బంధం ఎప్పటికీ పచ్చగా ఉండాలని, జీవితాంతం వారి మధ్య ప్రేమాభిమానాలు, సహచర్యమూ సజీవంగా ఉండాలన్నది తాత్పర్యము.
 
 ఆలుమగల మధ్య చిన్న చిన్న ప్రణయ కలహాలు మంచిదే.
 
ఒక రకంగా వారిద్దరూ రెట్టింపు ప్రేమతో కలుసుకోవడానికి ఆ కలహాలు కారణం అవ్వాలి కాని, ఆ ప్రణయ కలహాలు ప్రళయ కలహాలు కాకూడదు.
 
పసుపు కొమ్ము ఆరోగ్యానికి చిహ్నం. వధూవరులు ఇద్దరూ కూడా శరీర, మానసిక ఆరోగ్యాలు బాగా ఉండేటట్లు చూసుకోవాలి, నడుచుకోవాలి కూడానూ.
 
మరొకరి ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదు. అనవసర ఒత్తిళ్ళకి, క్షొభకీ, ఆందోళనకీ గురి చెయ్యరాదు.
 
అక్షింతలు సమిష్టి బాధ్యతలకు గుర్తు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలి.
 
అలాగే మనము కొంగుముడిలో తమలపాకులు, వక్క కూడా పెడతాము. ఈ రెంటిని సున్నంతో పుచ్చుకుంటే నోటికి ఎర్ర రంగు వస్తుంది.
 
 తమలపాకులు ఆకుపచ్చగా, వక్కలు నల్లగా, సున్నం తెల్లగా ఉన్నా నోటికి ఎర్ర రంగు వచ్చి వారి బంధం వారి ఇద్దరిలోనే కాదు, సమాజంలో కూడా అనుసంధానం చెయ్యబదిందని దీని అర్ధం.
 
పువ్వులు సంతోషానికి, పవిత్రతకీ మారుపేరు. పువ్వులు చూడండి, ఎక్కడ ఉన్నా చక్కటి అనుభూతులను కలిగిస్తుంది.
 
వధూవరులు కూడా ఒకరినొకరు సంతోషపెట్టుకోవడానికి కృషి చెయ్యాలి. ఒకరి కీర్తి ప్రతిష్ఠలు మరొకరికి వ్యాపింప చెయ్యాలి.
 
పవిత్ర మనస్కులై మెలగాలి. కందపిలకలు సంతానానికి ప్రతీక. వివాహలక్ష్యము ధర్మబద్ధమైన సంతానాన్ని పొందడం.
 
కందపిలకని ఎక్కడ పెట్టినా దానినుండి ఎన్నో పిలకలు తామరతంపరలా వస్తాయి. అందుకు కందపిలక, ఖర్జూరం.
 
మీ దాంపత్య జీవితం కూడా నూరేళ్ళు ఆనందంగా ఉండి మీ దాంపత్య జీవనం ఇంకొకరికి ఆదర్శం కావాలని, దంపతులు ఇద్దరూ కూడా ఇద్దరిలా కాక ఒకరిగా బ్రతకమని చెప్పడం. 
 
బ్రహ్మముడి వేడుక కాదు. ఇంగ్లీషు వాళ్ళు ప్రవేశపెట్టినవన్నీ వేడుకలు తప్ప వాటికి అర్ధం ఉండదు. మన భారతీయులు ప్రవేశపెట్టినవి ఏమైనా సార్ధకాలు.
 
ఆంగ్లేయుల గ్రీటింగ్ ని ఒక్కడికే సంవత్సరం అంతా శుభంగా సుఖంగా ఉండాలని కోరుతున్నారని చెబుతుంది.
 
భారతీయుల గ్రీటింగ్ సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకుంటుంది. అందుకని ప్రాచీనులు ప్రవేశపెట్టిన ప్రతీది సార్ధకమే.
 
అందరమూ సుఖంగా ఉండాలి. ఎవరికీ దుఖం కలుగరాదు, అనేది విశ్వమానవ దృష్టి కావాలి.
 

ఇంత పవిత్రమైన సనాతనమైన మన వివాహ క్రతువులను మార్పులు చేర్పులు లేకుండా మన పెద్దలు ఎలా చెప్పారో, మన శాస్త్రాలు ఎలా

చెప్పాయో అలా మనము ఆచరిస్తూ మన ఈ సనాతన సాంప్రదాయం ఇంతే పదిలంగా ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మన ప్రతి
ఒక్కరి పైనా ఉంది.
 
కాబట్టి, అందరం నేను సైతం అంటూ మన సనాతనధర్మాలను ముందుకు తీసుకువెళ్లడంలో చేయూతనిద్దం.
 
సర్వేజనా సుఖినోభవంతు
 
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి
 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here