క్షీరాబ్ధి ద్వాదశి (చిల్కు ద్వాదశి) అంటే ఏమిటి ?

0
12154

023

ఈ కార్తీకమాసంలో అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తనయోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అనే పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశినాడు ముప్పై ముగ్గురు దేవతలలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై తులసీ ధాత్రివనంలో ఉంటాడని చెప్తారు.

ఈ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు అంటే, పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనం చేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అను పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపకాంతితో, బాణసంచాలతో సమీప నదీజాలలో తెప్సోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక పూర్ణిమనాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభాలకు కట్టి ఆ వెంటిని మూడుమార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింది పార్వతీపరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి మూడుసార్లు త్రిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహిస్తారు. అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీకమాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్రముఖాలు కలిగిన ఆదిశేషుడు, చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా, ఇక మానవ మాత్రులమైన మనమెంత?” అని సూతమహాముని చెప్పారు.

మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానంలో ఆవునెయ్యి ఉత్తమోత్తమమైనది. మంచినూనె మధ్యమము, ఇప్పనూనె అధమము, ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు అధమాతి అధమములు. గేదె నేతితో దీపము, వెలిగిస్తే పూర్వ పుణ్యము కూడా నశించి పోతుంది. అదే స్వల్పంగా ఆవునేయి కలిపి వెలిగింస్తే దోషములేదని, అలా ఒకటి మొదలు వేయి వరకు దీపాలు వెలిగించుటం ఎంతో శుభప్రదమని వాటి సంఖ్యనుబట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని, దీపదాన మహాత్యంలో చెప్పివున్నారు. అలాంటి దీపారాధన పూజామందిరంలో, దేవాలయాలలో గృహప్రాంగణాలలో, తులసీ బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీతీరాలలో వెలిగించుటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి.

ఈ మాసంలో సోదరి చేతివంట భగనీ హస్తభోజనము చేసి యధాశక్తి వారికి కానుకలు సమర్పించుటంతో పాటు, సమీప వనంలో బంధువులు, స్నేహితులతో కలిసి ఉసి రిచెట్టును పూజించి, సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ వుండటం మంచిది. అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది.

అలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీకమాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ ‘‘కార్తీకపురాణ’’ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్యదినాలలో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానాలు మొదలైనవి చేయుటం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించుటమే కాకుండా, జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీకమాస వ్రతమహాత్యాన్ని గురించిసూతమహాముని శౌనకాది మునులకు వివరించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here