న్యాసం అంటే ప్రాధమిక అర్థం శుద్ధి చేయటం లేదా పవిత్రమొనర్చడం. న్యాసము వైదిక, తాంత్రిక సాధనలలో ముఖ్యమైన భాగము. న్యాసములు అనేకములుగా ఉన్నప్పటికీ నాలుగు రకాలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అవి రుషి న్యాసము, కరన్యాసము, మాత్రిక న్యాసము మరియు షడంగన్యాసము. మహాన్యాసము అను పద్ధతిని మహా శివభక్తి తత్పరుడైన రావణుడు సూత్రీకరించాడు. మహాశోడసన్యాసము శ్రీవిద్యలో భాగము.
న్యాసములో చేతి వేళ్ళను మరియు వివిధ శరీర భాగములను తాకుతూ తత్ మంత్రమును లేదా బీజాక్షరాలను పలుకుతూ పవిత్రం చేసుకుంటారు. శివపూజకు ముందు మహాన్యాసం చేయడం తప్పనిసరి. వివిధ శరీరభాగాలలో వివిధ దేవతలను ప్రతిష్టించుకుని దైవత్వాన్ని నింపుకున్న అనుభూతిలో అత్యంత పవిత్రంగా, పరమ నిష్ఠగా పూజాదికాలు నిర్వహించడం భారతీయ దేవతార్చనలో ప్రధానం. ఈ విధంగా చేసిన పూజవల్ల సకలము సిద్ధిస్తుంది. హిందూ దేవతా సాంప్రదాయాలలో కొన్ని వందల పూజాశాస్త్రములు, కొన్ని వేల పూజా విధులు లెక్కకు మించి రహస్యములైన సాధనాలు, వాటికి సంబంధిచిన న్యాసములు ఉన్నాయి. అవి మహామహులకు తప్ప సామాన్యులకు అందవు. అవి మహాశక్తివంతములై, నియమ నిష్ఠలతో కూడుకొన్నవై, సులభసిద్ధిదాయకములై ఉన్నవి. కాబట్టి నిష్ఠాగరిష్టులు, తాత్విక చింతన కలిగినవారు, లోక క్షేమమును కాంక్షించు వారు మరియు లోకకల్యాణానికై సాధన చేయువారికి మాత్రమే అది కూడా గురువులనుంచీ మాత్రమే లభిస్తాయి. ఆ స్థాయికి చేరుకోవడం జన్మజన్మల పుణ్యం మరియు ఏకాగ్ర సాధన వలననే సాధ్యమవుతుంది. సంసారబంధములలో ఉన్నాకూడా సాధన చేయవచ్చని చాలామంది నిరూపించారు. ఇప్పటికీ పట్టు విడువకుండా సాధన చేసేవారు ఉన్నారు. సాధన చేయాలన్న బలమైన సంకల్పం మనల్ని సరైన గురువు దగ్గరకు చేరుస్తుంది. కావున మనందరమూ ఆధ్యాత్మికమార్గాన్ని కొంతవరకైనా అనుసరించడం జీవితంలో చాలారకాలుగా మంచిని చేకూరుస్తుంది.
మహాకాళి కటాక్ష సిద్ధిరస్తు