
Omkaram in Telugu
హిందూ ధర్మమునందు ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. సర్వశ్రేష్ఠుడైన భగవంతునికి ఆకార రూ పం(నామ) నాదరూపం ఓంకారము. ప్రణవ నాద ము, ప్రధమ నామము, ఏకాక్షరమైన ఓంకారము. ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకార ము నుంచే యావత్తు జగము ఉద్భవించింది. ఋగ్వేదంలోని ‘అ’ ను, యజుర్వేదంలోని ‘ఉ’ ని, సామవేదంలోని ‘మ్’ ను కలిపితే ‘ఓం’కారం ఉద్భవించింది.
వేదముల సారము ఓంకారము. `ఓం’ అంటే ప్రారంభాన్ని తెలుపునది కూడా. ఓ కాక్షర మంత్రం, భగవంతుని ముఖ్యనామమైన `ఓం’కు అనేక అర్థాలు కలవని రుషులు తెలిపారు. బ్రహ్మనాదం ఓంకారం. ఆత్మ ఓంకార మంత్ర స్వరూపం ప్రణవ నాదమే ప్రాణం. ఆన్ని మంత్రాలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం’. దీనినే ప్రణవమని అంటారు. మంత్రోచారణం జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం.
‘ఓం’ అని తలచుకున్నంతనే వేదాలను చదివినంత ఫలితం వస్తుంది. అందుకే ఏ కార్యానికైనా మనం ముందుగా ‘ఓం’ అని చేర్చి ప్రారంభిస్తాము. పఠిస్తాము.
‘ఓం” అంటూ ఉచ్చరించే ఓంకారం పరమ పవిత్రమైంది. ఓంకారం సంస్కృతంలో ”ॐ” అక్షరం దైవంతో సమానం, ప్రణవ స్వరూపం, ఓంకారం శివరూప తత్వం. మహాశివుడు డమరుకం మోగిస్తున్నప్పుడు ఆ ధ్వనిలోంచి అక్షరాలు వచ్చాయట. ఆ సంగతి అలా ఉండగా ఓంకార మహత్తును వేదపండితులు ఎంతగానో వర్ణించారు. ఓంకారాన్ని మించిన మంత్రం లేదంటారు. మహా మహిమాన్వితమైన ఓంకారానికి అనేక అర్ధాలు ఉన్నాయంటూ నిర్వచించారు. ప్రధానంగా 18 అర్ధాలను సూచించారు.
ఆ అర్ధాలు ఇలా ఉన్నాయి
ఓంకారం తేజోవంతమైంది. సర్వలోకానికీ వెలుగునిస్తుంది.
ప్రేమైక తత్వాన్ని ఇస్తుంది.
ఓంకారం ప్రశాంతతని, ఆనందాన్ని, సంతృప్తిని ప్రసాదిస్తుంది.
గ్రహణశక్తిని పెంచి, అనేక అంశాలను అవగాహన చేసుకునే అవకాశం కలిగిస్తుంది.
ఓంకారం నిత్యజీవితంలో కలిగే కష్టనష్టాల నుండి రక్షిస్తుంది.
సృష్టిలో సూక్ష్మ ప్రాకృతిక అంశాలను స్థూల మార్గంలోకి తెస్తుంది.
ఓంకారం సూక్ష్మరూపంలో ప్రాణకోటిలో ప్రవేశిస్తుంది.
ప్రళయకాలంలో జగత్తును తనలో లీనం చేసుకుంటుంది.
ఓంకారం స్థూల, సూక్ష్మ, గుప్త, శబ్దనిశ్శబ్దాలను గ్రహిస్తుంది.
ప్రబోధాత్మకమైన బుద్ధిని ప్రసాదిస్తుంది.
ఓంకారం చరాచర జగత్తును శాసిస్తుంది
అజ్ఞానాన్ని, అంధకారాన్ని నశింపచేస్తుంది.
ఓంకారం విద్యను, వివేకాన్ని, జ్ఞానాన్ని, తేజస్సునూ ఇస్తుంది.
సర్వ ఐశ్వర్యాలనూ కల్పిస్తుంది.
ఓంకారం శుద్ధ అంతఃకరణను ప్రసాదిస్తుంది.
సర్వ వ్యాపితం.
ఓంకారం సమస్త జగత్తుకూ నాయకత్వం వహిస్తుంది.
కోరికలకు దూరంగా ఉంటూ, అందరి శ్రేయస్సూ కోరుకోవాలని ఉపదేశిస్తుంది.
భగవద్గీత 10వ అధ్యాయం 25వ శ్లోకంలో ఏకాక్షరమైన `ఓంకారమును నేనే’ అని అంటాడు శ్రీకృష్ణుడు. ఓంకారమును అనుమతి కోసం, సమ్మతి తెలియచేయడానికి కూడా ఉచ్ఛరిస్తాము. జ్ఞాన స్వరూపం ఓంకారం. నిరంతర మానసిక జపం ఆత్మశుద్ధిని కలిగిస్తుంది. భగవత్తత్త్వము నెరిగి నామజపం ద్వారా సాధన చేయడం వలన చిత్తశుద్ధి, తద్వారా పూర్ణత్వం సిద్ధిస్తుంది. మనలోని స్వార్థం తొలగిపోవాలంటే `ఓంకారాయ నమ:’ అంటూ జపించాలి.
ఈ సృష్టి అంతా మహావిష్ణువు సృష్టించిన మహా ప్రసాదము. మహావిష్ణువు యొక్క స్మరణ పరమ పావనమైనది. పరమాత్మకు ఇష్టమైనది `జపము.’ `జ’ అంటే జన్మ విచ్ఛేదం (జన్మం)`ప’ అంటే పాప నాశకం. కర్మల ఫలితమే జన్మ కారణం. జప యజ్ఞం వలన జన్మ, కర్మల ఫలితం నశించి మోక్షం సిద్ధిస్తుంది. పునర్జన్మనూ, పాపమును నశింపచేసేది జపం. ఇటువంటి జపములో ఓంకార జపం (ఓం కారాన్ని ఉచ్ఛరించడం) శ్రేష్ఠమైనది.
ఓంకారంతోను, శంఖారావంతోను, ఘంటా నాదముతోను దుష్టశక్తులన్నీ దూరంగా పారిపోతాయి. శబ్దం ముందు పుట్టిందనీ, ఆ శబ్దం నుంచే సృష్టి యావత్తూ ఆవిర్భవించిందనీ మహర్షులు చెప్పినవి సత్యవాక్కులు. మహా పాపిని కూడా యోగిగా మార్చగల శక్తి నామ జపం వలన సాధ్యపడుతుంది. జీవితంలో ఎంతో గొప్ప మార్పును ఇవ్వగలిగే శక్తి ఒక్క నామజపానికి మాత్రమే ఉంటుంది.
నల్లని మందమైన ఓంకార చిత్తాన్ని అరచేతిలో ఉంచుకొని నిశ్చల దృష్టితో చూస్తూ ఊయలవలె కదిలించటం ద్వారా దృష్టి మెరుగవటం, తలనొప్పి తగ్గటం వంటివి జరుగుతాయని చెబుతారు. ఓంకారాన్ని సక్రమంగా ఉచ్చరించటం వలన నాడీమండలం నిశ్చలమై, నిర్మలమై ఉండి అంతర్గత ఉద్వేగాలు తొలగి ప్రశాంతత సిద్ధిస్తుంది. నిత్యం ఉదయం, సాయంకాలం 3 నుండి 11 సార్లు ఓంకారోచ్చారణ చేస్తే దానివలన చేకూరే స్వస్థత జీవితంలోని ఒడిదుడుకులను క్రమపరచి ప్రశాంత జీవితాన్ని అందిస్తుంది. నాడీమండలం శక్తి ప్రేరకం. మన సకల చర్యల ద్వారా అనేక నాడులందు చలనమేర్పడుతుంది కాని సూక్ష్మ నాడులు మాత్రం చలించవు. సూక్ష్మనాడీమండల చలనానికి భ్రుకుటి, వెన్నుపూసలలో విశాల వాయుతరంగాలు సృష్టింపబడాలి.
ఓంకారాన్ని సక్రమ విధానంలో ఉచ్చరించటంలోనే అలాంటి సూక్ష్మనాడులు ప్రేరేపింపబడతాయి. ఆ సూక్ష్మనాడుల ప్రేరణ వ్యక్తికి అనేక శక్తులను ప్రసాదిస్తుంది. ఆ క్రమంలోనే అతీత జ్ఞానము, అతీత శక్తులు సాధింపగల్గుతారు. అలా ఓంకారం మానవుడిలో నిద్రాణమై ఉన్న అనేక శక్తులను బయటకు తీయగలదు. ఓంకారం నిత్యం చేస్తే మీలో క్రమంగా వచ్చే మానసిక పరిణామం మీకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో వైవిధ్యం కల ప్రకృతిలో ఏకత్వాన్ని నిరూపించేదే బ్రహ్మం. అంతా బ్రహ్మమయమే. ఆ బ్రహ్మమునకు ఏకైక ప్రతీక ఓంకారం. అదే అక్షర పరబ్రహ్మం. పరబ్రహ్మ స్వరూపం..!