
గ్రహ దోష నివారణలకు,పుణ్యానికి, సంతోష సమయాలలోనూ లేదా అత్యధిక లాభాలార్జించినప్పుడు, రకరకాల సందర్భాలలో దానాలు చెయ్యడం పరిపాటి. అయితే కన్యా దానం చెయ్యడానికీ ఇతర దానాలకీ తేడా ఉంది. దానం అంటే యజమాని తన ధర్మపత్నితో కలిసి తమ చేతిలోంచి దానం తీసుకునే వారి చేతిలోకి నీరు విడుస్తూ ‘ఇదం న మమ’ (ఇక ఇది నాది కాదు) అని చెప్పి ఇవ్వడం. ఇదే ధారా దత్తం అంటే. ఇక ఆ వస్తువుతో దానం చేసినవారికి ఎటువంటి సంబంధమూ ఉండదు. కానీ కన్యా దానం చేసేటప్పుడు వధువు తండ్రి ‘న మమ’ అనడు, అనకూడదు. ఎందుకంటే ఒక యోగ్యుడైన బ్రహ్మచారికి అతని జీవితం లో గృహస్తాశ్రమ ధర్మాల్ని నిర్వర్తించడానికీ, పుత్ర పౌత్రాదులను పొంది అన్ని బాధ్యతలనూ సక్రమంగా నెరవేర్చి , చివరగా మోక్షప్రాప్తిని సాధించడానికి తండ్రి తన కన్యారత్నాన్ని దానంగా ఇస్తాడు. అంతే తప్ప ఆమెను ధారాదత్తం చేయడు. కన్యాదానం చేసినా తలిదండ్రులకు ఆమె యోగక్షేమాలు విచారించే అన్ని అధికారాలూ ఉంటాయి. మెట్టినింటికి పంపినంత మాత్రాన స్త్రీ తన పుట్టినింటికి పరాయిది గానీ చుట్టం గాని కాదు. పుట్టినింటిలో ఆమె స్థానం కన్యాదానం వల్ల మారదు.