నూతన సంవత్సరం మొదటిరోజు ఏమి చెయ్యాలి? | What to do on New Year Day in Telugu

0
13237

ఆంగ్ల పాలన నుంచీ రాజకీయంగా విముక్తి దొరికినా సామాజికంగా మాత్రం ఇంకా పరాయి పాలనలోనే మగ్గుతోంది మన అఖండ భారతం. ఆంగ్ల పండుగలలో ఒకటైన జనవరి ఒకటిని దేశవ్యాప్తంగా అందరూ సంప్రదాయ పండుగ లాగా జరుపుకుంటారు. భారతదేశం అంటే ప్రేమ ఉన్నవారు కూడా ఆంగ్ల సంస్కృతి ప్రభావంలో పడిపోయి సంబరాలు జరుపుకుంటారు. గ్రెగేరియన్ క్యాలెండరు ప్రకారం జనవరి ఒకటవ తేదీని సంవత్సరాదిగా వేడుక చేసుకుంటారు. భారతదేశం అరమరికలు లేకుండా అన్ని మతాలనూ, వేషభాషలను, సంస్కృతీసంప్రదాయాలను స్వాగతిస్తూ వస్తోంది. మన మంచితనాన్ని అవకాశంగా తీసుకుని దేశం మొత్తాన్నీ ఆక్రమించిన ఆంగ్లేయులు తమ సంప్రదాయాలను మన సమాజం మీద బలవంతంగా రుద్దారు. ఇది స్వాతంత్ర్యం ముందు నుంచీ మొదలయిన దుర్గతి.

What to do on new year's day?
నూతన సంవత్సరం మొదటిరోజు ఏమి చెయ్యాలి? | What to do on New Year Day in Telugu

శాలివాహన శకం ప్రకారం చైత్రమాసం మొదటి రోజును ఉగాదిగా దేశం మొత్తం పండుగ చేసుకుంటుంది. కానీ ఈ ఆంగ్ల సంవత్సరాది వేడుకలకు అలవాటు పడిపోయాము కాబట్టి కనీసం మన సంప్రదాయాన్ని కొంత జోడించడం వల్లనైనా పరాయి పధ్ధతినుంచీ బయట పడటానికి ప్రయత్నిద్దాం. సంవత్సరాది కాబట్టి ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేచి, చక్కగా దంతధావన స్నానాదికాలు ముగించుకుని, ఆదిశక్తిని కొలవాలి, ఏ రూపంలో కొలిచినా పలుకుతుంది అమ్మ. లక్ష్మీ దేవిని పూజించడం మంచిది. సకల సంపదలకూ మూలపుటమ్మ కాబట్టి సంవత్సరం మొదటిరోజున ఆ చల్లని తల్లి లక్ష్మీ దేవి పూజిస్తే ఆమె ఆశీస్సులు సర్వదా మన వెంట ఉంటాయి. అన్ని రకాల ఐశ్వర్యాలతో పాటు జ్ఞాన సంపద కూడా వృద్ధి చెందుతుంది.

ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులకు నమస్కరించి చక్కటి ఆహారాన్ని తినాలి. ఒకవేళ స్నేహితులతో బయటకు వెళితే అవసరంలో ఉన్నవారికి చేతనైన సహాయం చెయ్యటం మరిచిపోవద్దు. ఆకలిగొన్నవారెవరికైనా పట్టెడన్నం పెట్టిస్తే మరీ మంచిది. ఆ రోజున అనవసరమైన మాటలు వాదాలకు దిగకుండా సౌమ్యంగా మాట్లాడాలి. ఆనందంగా నవ్వుతూ ఉండాలి. సాయంత్రం ఏదైనా గుడికి వెళ్లి సంవత్సరమంతా గడపడానికి కావలసిన ప్రశాంతతను భావన చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఒడ్డి నిలబడే ధైర్యం ప్రసాదించమని ఆ దేవదేవుడిని వేడుకోవాలి. డైరీ రాయడం అలవాటు ఉంటే కొన్ని మంచి వాక్యాలు రాసుకుని ఈ సంవత్సరం చేయ సంకల్పించిన వాటిని మననం చేసుకోవాలి. ప్రత్యేకంగా రాసుకోవాలి. డైరీ రాసే అలవాటు లేకుంటే ఒకటి కొని మొదలు పెట్టండి. జీవితంలోని ముఖ్యఘట్టాలను ఈ విధంగా మనం జాగ్రత్త చేసుకోవచ్చు. మరుసటి సంవత్సరానికి బేరీజు వేసుకోవడానికి డైరీ రాయడం చాలా పనికి వస్తుంది. రాత్రికి హనుమంతుడిని స్మరిస్తూ నిద్రించాలి.

ఈ విధంగా చేసినట్టయితే సంవత్సరమంతటా జీవితంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి.

సర్వేజనా స్సుఖినొ భవంతు

లోకాస్సమస్తా స్సుఖినొ భవంతు

సమస్త సన్మంగళాని భవంతు

ఓం శాంతి శాంతి శాంతి:

హరిఓం.కాం వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జై మహా కాళి _/\_

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here